Begin typing your search above and press return to search.

'కంచరపాలెం' వెనుక కథ అదీ..

By:  Tupaki Desk   |   2 Sep 2018 7:05 AM GMT
కంచరపాలెం వెనుక కథ అదీ..
X
అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ఓ చిన్న సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ రావడం అరుదుగా జరుగుతుంటుంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు అలాంటి క్రేజే కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు చూశారు. దీన్ని గొప్ప సినిమాగా అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసి.. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుండటం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది.. ఎలా తీశారు.. ఎలా తమ చేతికి వచ్చింది అనే విషయాల్ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు వివరించారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా ముందుగా తమ సంస్థలోనే పని చేసినట్లు సురేష్ వెల్లడించాడు. అతను తన తండ్రి రామానాయుడు ఉన్న సమయంలో సెట్ అసిస్టెంటుగా తమ స్టూడియోలో పని చేశాడన్నారు. కొన్నేళ్ల తర్వాత అతడికి ఈ చిత్ర నిర్మాత ప్రవీణతో పరిచయం అయిందని.. ఆమె యుఎస్ లో డాక్టర్ అని.. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదే అని ఎప్పుడూ ఫీలయ్యే ప్రవీణ.. తాను సంపాదించిన డబ్బులతో మంచి సినిమా చేయాలన్న తపనతో ఉండేదని.. ఆమె మహా చెప్పిన కథ నచ్చి ‘కేరాఫ్ కంచరపాలెం’ తీయడానికి ముందుకొచ్చిందని చెప్పాడు. ఐతే ఈ కథ తయారు చేయడానికి ముందే దర్శకుడు వైజాగ్ శివార్లలోని కంచరపాలెం ఊరికి వెళ్లాడని.. కొన్ని నెలల పాటు అక్కడే ఉండి.. అక్కడి మనుషుల్ని వాళ్ల నేపథ్యాల్ని.. కథల్ని అధ్యయనం చేసి.. వాటి ఆధారంగా కథ తయారు చేసుకుని.. అక్కడి వ్యక్తుల్నే ప్రధాన పాత్రలకు ఎంచుకుని.. ఆపై అక్కడే సినిమా కూడా తీశాడని.. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదని.. ఇది నిజాయితీతో చేసిన ప్రయత్నమని సురేష్ అన్నారు.

సినిమా పూర్తయ్యాక వెంకటేష్.. ప్రవీణ తనను కలిసి చూపించారని.. వెంటనే నచ్చేసి తనే రిలీజ్ చేయాలని అనుకున్నానని.. కానీ దీన్ని ప్రమోట్ చేయడం కష్టమని అర్థమైందని చెప్పారు. ముందుగా చంద్రశేఖర్ యేలేటికి సినిమా చూపిస్తే.. అతడికి నచ్చి కీరవాణికి చెబితే.. ఆయన చూసి రాజమౌళికి చూపించారని.. ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు సినిమా చూసి మెచ్చారని.. జనాల్లోకి తీసుకెళ్లారని తెలిపారు సురేష్. ఇలాంటి సినిమాలు జనాల్లోకి వెళ్లడం కష్టమని.. వెళ్తే మాత్రం వాళ్ల మనసుల్లో నిలిచిపోతాయని అన్నారు సురేష్.