Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూసర్.. తోడు లేకుంటే దిగడా?

By:  Tupaki Desk   |   7 Dec 2017 1:30 AM GMT
స్టార్ ప్రొడ్యూసర్.. తోడు లేకుంటే దిగడా?
X
తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద బేనర్లలో ఒకటి ‘సురేష్ ప్రొడక్షన్స్’. ఈ బేనర్ మీద దేశంలోని అనేక భాషల్లో సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు రామానాయుడు. ఆయన వారసత్వాన్ని అందుకున్న సురేష్ బాబు కూడా భారీ సినిమాలు తీశారు. ఐతే ఒక దశ దాటాక సురేష్ బాబు ఉన్నట్లుండి స్లో అయిపోయారు. ఈ బేనర్లో పెద్ద సినిమాలకు సెలవిచ్చేశారు. రామానాయుడు ఉండగా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాలు విరామం లేకుండా తీస్తుండేవారు కానీ.. ఆయన వెళ్లిపోయాక ఆ తరహా సినిమాలకు కూడా తెరపడిపోయింది. సురేష్ చాలా వ్యూహాత్మకంగా సినిమాలు చేస్తున్నారు.

ఆయన సోలోగా సినిమాలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. మరో సంస్థ భాగస్వామ్యంలో మాత్రమే సురేష్ సినిమా చేస్తున్నారు. దృశ్యం.. గోపాల గోపాల.. గురు.. అవును-2.. నేనే రాజు నేనే మంత్రి.. ఇలా గత కొన్నేళ్లలో సురేష్ బాబు ఏ సినిమా తీసినా అందులో మరో సంస్థ భాగస్వామ్యం ఉంటోంది. తక్కువ పెట్టుబడి పెట్టి.. సినిమాను కొంచెం గట్టిగా రిలీజ్ చేయడానికి సహకరించడం ద్వారా ఆదాయంలో వాటా తీసుకుంటున్నారు సురేష్.

తన కొడుకు రానాను హీరోగా పెట్టి తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను కూడా సురేష్ సోలోగా ప్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు తన తమ్ముడు వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో మొదలుపెట్టిన సినిమాకు కూడా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ల సహకారం తీసుకుంటున్నాడు సురేష్. నిజానికి ఈ సినిమాకు మంచి బిజినెస్ అయ్యే అవకాశమున్నా కూడా సురేష్ రిస్క్ తీసుకోవట్లేదు. భారీ లాభాలు రాకపోయినా పర్వాలేదు.. నష్టాలు రాకూడదన్న స్ట్రాటజీతో ఆయన సినిమాలు చేస్తున్నారని ఇండస్ట్రీలో అంటున్నారు. టాలీవుడ్లో కొందరు పెద్ద నిర్మాతల తీరు ఇలాగే ఉంటోందిప్పుడు.