Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ సమస్యలపై సురేష్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Dec 2017 6:29 PM GMT
ఇండస్ట్రీ సమస్యలపై సురేష్ సంచలన వ్యాఖ్యలు
X
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు.. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఓపెనయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రమాదకర పరిస్థితులున్నాయని.. అన్నింటినీ కార్పెట్ కింద దాచేస్తున్నారని ఆయన అన్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లు పెడుతున్నారని.. దీంతో అసలైన సక్సెస్ మీట్లు ఏవో తెలుసుకోలేకపోతున్నారని ఆయనన్నారు. థియేటర్ల సమస్యల మీద కూడా ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. తన సమర్పణలో వచ్చిన ‘మెంటల్ మదిలో’ సినిమాకు సంబందించి అనాలసిస్ మీట్ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది నిజాలు కార్పెట్ కింద దాచేస్తున్నారు. ఇండస్ట్రీకిది చాలా ప్రమాదం. చాలామంది సక్సెస్ మీట్‌లు పెడుతున్నారు. అసలైన సక్సెస్ మీట్ అంటే ఏంటో అని ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు సినిమా రిలీజై నెల రోజు కాకముందే టీవీల్లో వేసేస్తున్నారు. ఇది మంచిది కాదు. దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియట్లేదు. కొన్ని రోజులకు సినిమాను నేరుగా టీవీల్లోనే విడుదల చేస్తారేమో? ఇప్పుడు వారం వారం 10-15 సినిమాలు విడుదల చేస్తున్నారు. థియేటర్లు లేక ఇబ్బంది పడుతున్నారు.

సినిమాకు కోటి రూపాయలు ఖర్చు చేస్తే ప్రమోషన్ కు కోటి రూపాయలవుతోంది. థియేటర్లలో ఉచితంగా ట్రైలర్ ప్రదర్శిస్తే చిన్న సినిమాలకు మేలు జరుగుతుంది. మరోవైపు డిజిటల్ ఫిలిం ఇండస్ట్రీ మన దేశంలో అభివృద్ధి చెందడం లేదు. ఈ సమస్యలన్నింటిపై నిర్మాతలు కలిసికట్టుగా కదలాలి. లేదంటే భవిష్యత్తులో పెద్ద గొడవలవుతాయి’’ అని సురేష్ బాబు అన్నారు.