Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘24’

By:  Tupaki Desk   |   6 May 2016 10:48 AM GMT
మూవీ రివ్యూ: ‘24’
X
చిత్రం: ‘24’

నటీనటులు: సూర్య - సమంత - నిత్యా మీనన్ - అజయ్ - శరణ్య - గిరీష్ కర్నాడ్ - హర్షవర్ధన్ - సుధ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నేపథ్య సంగీతం: ఎ.ఆర్.రెహమాన్-కుతుబ్
ఛాయాగ్రహణం: తిరు
నిర్మాత: సూర్య
రచన-దర్శకత్వం: విక్రమ్ కుమార్

13బి.. ఇష్క్.. మనం.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు తీసిన విలక్షణ దర్శకుడు విక్రమ్.కె.కుమార్. ఈసారి ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్యతో కలిసి ‘24’ చేశాడు. కాలంలో ప్రయాణించే గడియారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అటు తమిళం.. ఇటు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

డాక్టర్ శివకుమార్ (సూర్య) ఓ శాస్త్రవేత్త. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. కాలంలో ప్రయాణం చేసే గడియారాన్ని తయారు చేస్తాడు. ఐతే దీని గురించి ముందే తెలుసుకున్న అతడి కవల సోదరుడు ఆత్రేయ (సూర్య) తన సోదరుడి మీద దాడి చేస్తాడు. వాచ్ కోసం తన శివకుమార్ తో పాటు అతడి భార్య ప్రియ (నిత్యామీనన్)ను కూడా చంపేస్తాడు. ఐతే శివకుమార్ తాను చనిపోతూ పసివాడైన తన కొడుకు మణిని - ఆ వాచ్ ను ఓ అమ్మాయికి అప్పగిస్తాడు. తనను కాపాడిన అమ్మాయినే అమ్మగా భావించి తన దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. ఐతే తన దగ్గరున్న వాచ్ ద్వారా కాలంలో ప్రయాణించవచ్చని అనుకోకుండా మణికి తెలుస్తుంది. దాంతో అతను ప్రయోగాలు చేస్తుంటాడు. మరోవైపు శివకుమార్ ను చంపిన అనంతరం ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన ఆత్రేయ 26 ఏళ్ల తర్వాత తెలివిలోకి వస్తాడు. అతడికి మణి దగ్గర వాచ్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆ వాచ్ కోసం ఆత్రేయ-మణి మధ్య పోరు మొదలవుతుంది. చివరికి ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

గతాన్ని మార్చలేం.. భవిష్యత్తును ఊహించలేం.. కానీ ఈ రెండు చేయగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది..? ఆ అనుభూతిని మాటల్లో వర్ణించగలమా..? ఈ చిలిపి ఆలోచనలోంచి ఒక అద్భుతమైన కథ పుట్టింది రెండు దశాబ్దాల క్రితం. ప్రతి మనిషి మదిలోనూ మెదిలే ఒక ఫాంటసీకి వెండితెర రూపం ఇస్తూ.. ‘ఆదిత్య 369’ సినిమాతో మరో ప్రపంచంలో విహరింపజేశాడు సింగీతం శ్రీనివాసరావు. ఆ స్ఫూర్తితో భారతీయ వెండితెరపై మరికొన్ని టైమ్ ట్రావెలింగ్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు విక్రమ్ కుమార్ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. విక్రమ్... ‘ఆదిత్య 369’తో పాటు ఇంకేవో సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చు. ఐతే ‘24’ విక్రమ్ మార్కు సినిమా. ‘ఆదిత్య 369’ తరహాలోనే మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి ఓ కొత్త అనుభూతిని పంచే సినిమా.

డ్రామా మొదలవగానే లాజిక్ ఆగిపోతుందంటాడు ఓ ప్రఖ్యాత ఫిలిం మేకర్. ఇక టైమ్ ట్రావెలింగ్ అన్నది పూర్తిగా ఊహాజనితమైన విషయం. ఇక్కడ లాజిక్ అన్న ప్రస్తావనే తేకూడదు. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత కన్విన్సింగ్ గా చెప్పారన్నది ఇక్కడ కీలకమైన విషయం. ఇందులో విక్రమ్ డిస్టింక్షన్ లో పాసయ్యాడు. ఈ ఊహజనిత కథతో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేశాడు. ఆడియన్స్ వివిధ రకాల ఎమోషన్లను ఫీలయ్యేలా చేయడంలో అతను విజయవంతమయ్యాడు. ‘24’లో కీలకమైన మూడు పాత్రలు మనకు మూడు రకాల భావోద్వేగాల్ని కలిగిస్తాయి. ఆత్రేయ పాత్ర భయపెడుతుంది.. శివకుమార్ పాత్ర బాధ కలిగిస్తుంది.. మణి పాత్ర గిలిగింతలు పెడుతుంది. సూర్య లాంటి గొప్ప నటుడు విక్రమ్ చేతికి చిక్కడంతో అతడి పని తేలికైంది. సృజనాత్మకతకు భద్దులేమీ పెట్టుకోకుండా తన కలల ప్రపంచంలో ప్రేక్షకుల్ని విహరింపజేశాడతను. అక్కడక్కడా ఈ ప్రయాణంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా.. చివరికి ప్రయాణం ఓ మంచి అనుభూతినే మిగులుస్తుంది.

అనుకోకుండా వర్షం.. తన తల్లి తడుచుకుంటూ లోపలికి వస్తుంది. బట్టలు తడిచిపోయాయని బాధపడుతుంది. అంతకుముందే తన దగ్గర ఉన్న వాచ్ ద్వారా కాలంలో ప్రయాణం చేయొచ్చని తెలుసుకున్న హీరో.. టైంను 10 నిమిషాలు వెనక్కి నెడుతాడు. తన తల్లికి గొడుగిచ్చి పంపిస్తాడు. పైకెళ్లి.. చకచకా బట్టలు తీసేస్తుంటాడు. అంతలో వర్షం మొదలవుతుంది. ఐతే సడెన్‌ గా వాచ్ లో కాలాన్ని ఎక్కడికక్కడ ఆపేసే ఫ్రీజ్ మూమెంట్ క్లిక్ చేస్తాడు. అంతే వాన చినుకులు మధ్యలో ఆగిపోయిన ఫ్రీజింగ్ మూమెంట్ చూపిస్తాడు దర్శకుడు. అలా కాలాన్ని ఆపేసి బట్టలు తీసి లోపల పెట్టేసి మళ్లీ కాలాన్ని యతాతథంగా నడిపిస్తాడు కథానాయకుడు. ఈ మూమెంట్ చూసిన ప్రేక్షకుడి అనుభూతిని మాటల్లో వర్ణించలేం. తెరమీద చూసి ఆస్వాదించాల్సిందే.

తాను ఎంచుకున్న కథాంశం ఇచ్చిన సృజనాత్మక స్వేచ్ఛను వినియోగించుకుని విక్రమ్ కుమార్ తెరమీద ఇలాంటి ఎన్నో చిలిపి సన్నివేశాల్ని ఆవిష్కరించాడు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ లో ఇలాంటి సన్నివేశాలు బోలెడన్ని వస్తాయి. ప్రథమార్ధమంతా ఇలాంటి సరదా సన్నివేశాలతోనే రయ్యిన దూసుకెళ్తుంది. దీనికి ముందు ఆరంభంలో ‘24’ కథను పరిచయం చేసే 20 నిమిషాల ఎపిసోడ్ ఓ హాలీవుడ్ సినిమాను చూస్తున్న భావన కలిగిస్తుంది. ఈ ఎపిసోడ్ అనంతరం వాచ్ సంగతి పక్కనబెట్టేసి ఏ ఇంటర్వెల్ దగ్గరో దాన్ని మళ్లీ తెరమీదికి తెస్తారేమో అనుకుంటాం కానీ.. విక్రమ్ మాత్రం హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కోసం కూడా ఈ వాచ్ నే ఉపయోగించుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు దిమ్మదిరిగే షాకిస్తుంది. అక్కడి నుంచి సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఆత్రేయ పాత్ర పున:ప్రవేశంతో కథ మలుపు తిరుగుతుంది.

ఇక ద్వితీయార్ధమంతా ప్రతి పావుగంటకో మలుపు తిరుగుతూ సాగుతుంది కథ. ఐతే ఈ మలుపులు ప్రేక్షకుడిని కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ప్రేక్షకుడిని మరీ ఎక్కువసార్లు ఫూల్ చేసేయడంతో ఒకట్రెండు సార్లు అసహనం కలిగిస్తుంది కూడా. ఐతే ఎక్కడా క్యూరియాసిటీ మాత్రం మిస్సవదు. హీరోకు తన గతమేంటో తెలిశాక.. అతడికి.. తనను పెంచిన తల్లికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్.. కొంతవరకు ప్రేక్షకుల్ని పక్కదోవ పట్టిస్తాయి. హీరోయిన్ ఇంట్లో రొమాంటిక్ ట్రాక్ కూడా కొంచెం శ్రుతి మించిన భావన కలిగిస్తుంది. ఐతే ఆ తర్వాత ఇట్టే సమయం తీసుకోకుండా హీరో వెర్సస్ విలన్ ట్రాక్ ను రక్తి కట్టించాడు దర్శకుడు.

ఐతే సామాన్య వాచ్ మెకానిక్ అయిన హీరో.. తన సైంటిస్టు తండ్రి ఏళ్ల తరబడి కష్టపడి తయారు చేసిన వాచ్ ను తాను కోరుకున్న ప్రకారం డెవలప్ చేయగలడని విలన్ నమ్మడం.. హీరో ఆ ప్రకారమే దాన్ని మార్చేయడం సిల్లీగా అనిపిస్తుంది. దర్శకుడు మరీ ఇంత లిబర్టీ తీసుకోవాల్సింది కాదు. ఇక్కడొక్క చోటే ‘24’ కన్విన్సింగ్ గా అనిపించదు. క్లైమాక్స్ మాత్రం మళ్లీ విక్రమ్ ముద్రను చూపిస్తుంది. హీరో-విలన్ ఇద్దరూ వాచ్ ద్వారా గతంలోకి ప్రయాణించడం.. అడ్వాంటేజ్ పూర్తిగా విలన్ కే ఉన్నప్పటికీ అతడు బోల్తా కొట్టేందుకు దారి తీసే సన్నివేశాలు రసవత్తరంగా సాగుతాయి. విక్రమ్ లోని దర్శకుడి గొప్పదనం తెలిసేది ఇక్కడే. ప్రయోగాత్మక చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులు సంతృప్తికరంగా థియేటర్ నుంచి బయటికి వస్తారు. ‘24’ కాన్సెప్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్నే ఇష్టపడేవారికి అంతగా రుచించకపోవచ్చు. కొన్ని లోపాలున్నా సరే.. అక్కడక్కడా సిల్లీగా అనిపించినా.. ‘24’ వైవిధ్యమైన సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి మిగులుస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు:

సూర్య ఎంతటి అరుదైన.. గొప్ప నటుడో చెప్పడానికి ‘24’ మరో రుజువు. మూడు పాత్రల్లోనూ అద్భుతంగా నటించాడతను. అతను పడ్డ కష్టమంతా తెరమీద కనిపిస్తుంది. శివకుమార్ పాత్రతో అమాయకత్వాన్ని.. ఆత్రేయ పాత్రతో క్రూరత్వాన్ని.. మణి పాత్రతో చిలిపితనాన్ని చక్కగా పండించాడతను. సూర్య నటనా కౌశలాన్ని తెలిపే చాలా సన్నివేశాలు ‘24’లో ఉన్నాయి. సమంత ఎంత క్యూట్ గా కనిపించిందో అంత క్యూట్ గా నటించింది. కీలకమైన పాత్రలో అజయ్ కూడా రాణించాడు. నిత్యా మీనన్ కనిపించేది కొద్దిసేపే అయినా తన ప్రత్యేకతను చాటుకుంది. గిరీష్ కర్నాడ్, సుధ కూడా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

‘24’ ఓ విజువల్ వండర్ గా తెరకెక్కడంలో టెక్నీషియన్స్ పాత్ర కీలకం. సినిమాలో ఆరంభం నుంచి చివరి దాకా టెక్నీషియన్స్ ప్రతిభ కనిపిస్తుంటుంది. అన్ని విభాగాల సమష్టి కృషి తెరమీద కనిపిస్తుంది. వినిపిస్తుంది. కెమెరామన్ తిరు తెరను వర్ణరంజితం చేశాడు. విక్రమ్ టేస్టుకు తగ్గ వైబ్రంట్ థీమ్ తో.. కంటికింపైన కెమెరా పనితనంతో ‘24’ను ఓ స్పెషల్ మూవీగా మలిచాడు. ప్రేమ పరిచయమే పాటలో.. కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రెహమాన్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. పాటలు ఆడియోలో కంటే తెరమీద బాగా అనిపిస్తాయి. పాటలన్నీ కూడా కథలో భాగంగా వస్తాయి. ప్రేమ పరిచయమే పాట వెంటాడుతుంది. ఆ ప్రేమగీతం మినహాయిస్తే.. మిగతా పాటలన్నీ ఓ కాన్సెప్ట్ ప్రకారం సాగుతాయి. రెహమాన్ తో పాటు కుతుబ్ అందించిన నేపథ్య సంగీతం మరో హైలైట్. 24 థీమ్ మ్యూజిక్ సూపర్బ్ అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్.. ఎడిటింగ్ కూడా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అతి పెద్ద బలం. సూర్య ఎక్కడా రాజీ పడలేదు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో సినిమాను తెరకెక్కించారు. ఇక దర్శకుడు విక్రమ్ తాను ఎంతటి విలక్షణ దర్శకుడినో మరోసారి రుజువు చేసుకున్నాడు. కాన్సెప్ట్.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. ఇలా క్రెడిట్ వేసుకున్న విభాగాలన్నింట్లో అతను ప్రతిభ చూపించాడు.

చివరగా: 24.. వండర్ ఫుల్ జర్నీ.. డోంట్ మిస్ ఇట్!!!

రేటింగ్: 3.25/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre