Begin typing your search above and press return to search.

ప్రయోగాల బాటలో సాహసాల సూర్య

By:  Tupaki Desk   |   23 July 2021 4:41 AM GMT
ప్రయోగాల బాటలో సాహసాల సూర్య
X
తెలుగు .. తమిళ సినిమా ఇండస్ట్రీల మధ్య చాలా దగ్గర సంబంధం .. అనుబంధం కనిపిస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడి హీరోల సినిమాలు అక్కడ .. అక్కడి హీరోల సినిమాలు ఇక్కడ విడుదలవుతూ వస్తున్నాయి. రజనీకాంత్ .. కమలహాసన్ సమయంలో ఈ అనుబంధం మరింతగా పెరుగుతూ వచ్చింది.

వాళ్లిద్దరి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదల కావడం మొదలెట్టాయి. వాళ్ల సినిమాలను అనువాదాలుగా తెలుగు ప్రేక్షకుల ఎప్పుడూ భావించలేదు. తమ హీరోలుగానే అభిమానించారు .. స్ట్రైట్ సినిమాల మాదిరిగానే ఆదరించారు.

విక్రమ్ తరువాత సూర్య కూడా అదే పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టారు. సూర్య అసలు పేరు 'శరవణన్ శివకుమార్'. తండ్రి శివకుమార్ తమిళంలో చాలా సినిమాలలో నటించడం వలన, సహజంగానే సూర్య అడుగులు కూడా నటన వైపే పడ్డాయి. అలా సూర్య 1997లో 'నెరుక్కునేర్' సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత నుంచి సినిమాలు చేసుకుంటూ వెళ్లినప్పటికీ. 'కాఖా కాఖా' అనే సినిమా సాధించిన సంచలన విజయంతో, ఆయన స్టార్ డమ్ ను అందుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన స్టార్ హీరోగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

సూర్య తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి తన సినిమాల మధ్య ఎంతమాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉండటం విశేషం. తన సినిమా సక్సెస్ అయినా, ఫ్లాపైనా ఆ తరువాత సినిమాపైనే సూర్య ఫోకస్ పెడుతూ ఉంటారు. సమయాన్ని ఎంతమాత్రం వృథా చేయకపోవడమనేది సూర్యలో కనిపిస్తుంది.

తెలిసిన పనిని ఒక తపస్సులా చేయాలనేది ఆయన అభిప్రాయంలా అనిపిస్తుంది. అందువలన ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటారు. గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన సొంత బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

సూర్య సినిమాల్లో యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కనిపిస్తాయి. అలాగే మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే భావోద్వేగాలు ఉంటాయి. కథను విడిచి సాము చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించరు. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు అనే వాటి చుట్టూ అల్లుకున్న కథలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

ఎమోషన్స్ తో కూడుకున్న యాక్షన్ వల్లనే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని ఆయన బలంగా నమ్ముతారు. ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

కమల్ .. విక్రమ్ తరువాత కొత్తదనానికి ప్రత్యేకతనిచ్చే కథానాయకుడిగా సూర్య కనిపిస్తాడు. అందుకే ఆయన కెరియర్లో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు కనిస్తాయి. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా ఆయన సిద్ధపడుతూ ఉంటారు. 'శివపుత్రుడు' .. 'గజిని' .. ' సూర్య సన్నాఫ్ కృష్ణన్' 'సెవెంత్ సెన్స్' .. '24' వంటి సినిమాలు ఆయన చేసిన ప్రయోగాలకు అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి.

సాహసంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను ఒక్కోమెట్టు పైకెక్కిస్తూ వెళ్లాయి. తమిళనాట ఆయనకి విపరీతమైన మాస్ ఇమేజ్ ఉంది .. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు.

తమిళంతో పాటు తెలుగులోను సూర్యకి మంచి క్రేజ్ ఉంది .. ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతుంటాయి. 'సింగం' సిరీస్ లో వచ్చిన సినిమాలు తమిళంతో పాటు సమానంగా తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే సూర్యనే అన్నంతగా ఆయన ఈ సినిమాల్లో విజృంభించారు .. ద్విపాత్రాభినయాల్లోను మెప్పించారు. మాస్ యాక్షన్ హీరోగా మనసులు దోచుకున్న సూర్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.