Begin typing your search above and press return to search.

భారతీయుడు ముందుకు? కమల్ వెనక్కా?

By:  Tupaki Desk   |   16 Oct 2017 4:00 AM GMT
భారతీయుడు ముందుకు? కమల్ వెనక్కా?
X
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన భారతీయుడు సంచలనం సృష్టించింది. అందులో సేనాపతి పాత్రలో కమల్ నటనను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. మేకప్ కు సంబంధించి ఈ మూవీ ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీయాలన్న ప్రతిపాదన వచ్చింది. భారీ బడ్జెట్ తో రెండోపార్ట్ ను గ్రాండ్ గా తీయాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నాడు. ఈ సినిమా నిర్మించేందుకు తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకొచ్చాడు.

అంతా సిద్ధం అనుకుంటున్న టైంలో భారతీయుడు-2 బ్రేక్ పడిందంటూ కోలీవుడ్ లో హీరో సూర్య అభిమానులు ప్రచారం మొదలెట్టారు. ఈ మూవీలో నటించేందుకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో కమల్ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగించారు. భారతీయుడు-2 సినిమా సూర్య హీరోగా తెరకెక్కుతుందనే రూమర్స్ ఓ రేంజిలో స్ప్రెడ్ చేశారు. ఈ రూమర్స్ తో కోలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాని.. డైరెక్టర్ శంకర్ గానీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. అలాగని ఈ రూమర్స్ ను ఖండించే ప్రయత్నమూ చేయలేదు.

నటుడిగా కమల్ కెరీర్ లో ఎన్నో గొప్పగొప్ప పాత్రలు చేశాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అలాంటి గొప్ప పాత్రల్లో కచ్చితంగా అగ్రస్థానంలోనే భారతీయుడు పాత్ర ఉంటుంది. ఓ రకంగా సేనాపతి పాత్రకు కమల్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఒకవేళ కోలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమై చిన్నచిన్న కారణాలకు రెండోపార్ట్ కాదనుకుంటే మాత్రం ఆ నిర్ణయం అంత గొప్ప నటునికి శోభనివ్వదనే చెప్పాలి.