Begin typing your search above and press return to search.

మలయాళ దర్శకుడికి సూర్య గ్రీన్ సిగ్నల్?

By:  Tupaki Desk   |   16 Jan 2023 11:30 AM GMT
మలయాళ దర్శకుడికి సూర్య గ్రీన్ సిగ్నల్?
X
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు వైవిధ్యభరితంగా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులందరూ ఓటీటీ ద్వారా ప్రపంచ స్థాయి కంటెంట్ కు బాగా దగ్గర అయిపోయిన నేపథ్యంలో పక్కా కమర్షియల్ లేదా రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ లాంటి సినిమాలు చేయడానికి సూర్య ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ ఉండేలా చూసుకుంటున్నాడు.

సూర్య తన 42వ సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సిరుత్తై శివ దర్శకత్వంలో ఆయన 42వ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ అలాగే యూవి క్రియేషన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రూపొందుతోంది. దాదాపు పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు సూర్య మలయాళ డైరెక్టర్ తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మలయాళ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరీతో సూర్య ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మలయాళంలో అంగమలై డైరీస్, జల్లికట్టు వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లిజో జోస్ తాజాగా సూర్యకి ఒక కథ చెప్పారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో లిజో జోస్ వెల్లడించారు. తాను చెప్పిన ప్లాట్ కి సూర్య ఇంప్రెస్ అయ్యారు కానీ... కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ప్రస్తుతం లిజో జోస్ మోహన్ లాల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే మోహన్‌లాల్‌తో మలైకోట్టై వాలిబన్ అనే చిత్రాన్ని లిజో జోస్ ప్రకటించారు.

మరోపక్క సూర్య 42వ సినిమా పూర్తి అయిన తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే డైరెక్టర్ 'బాల'తో చేస్తున్న సినిమా నుంచి బయటకు వచ్చేశానని సూర్య ప్రకటించిన తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కాబట్టి ఈ మలయాళ దర్శకుడితో సినిమా సూర్య తన 44వ సినిమా చేసే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.