Begin typing your search above and press return to search.

సూర్యకు సెల్యూట్ చేయాల్సిందే

By:  Tupaki Desk   |   6 May 2018 12:00 PM GMT
సూర్యకు సెల్యూట్ చేయాల్సిందే
X
తెరమీద హీరోలుగా కనిపించేవాళ్లందరూ నిజ జీవితంలో హీరోల్లా ఉండరు. కోట్లు కోట్లు పారితోషకాలు పుచ్చుకుంటున్నా.. సమాజం కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడే హీరోలు చాలామందే కనిపిస్తారు. కానీ కొంతమంది మాత్రమే తాము ఆ స్థాయిలో ఉండటానికి సమాజమే కారణమని.. సొసైటీకి తమ వంతుగా ఏదైనా చేయాలని తపిస్తుంటారు. తమ ఆదాయం నుంచి పెద్ద మొత్తాన్ని పక్కకు తీసి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. తమిళ స్టార్ హీరో సూర్య.. అతడి కుటుంబ సభ్యులు ఈ కోవకే చెందుతారు. ‘అగరం’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఏటా కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడుతుంటుంది ఈ సంస్థ. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే వందల మంది విద్యార్థులకు ఈ సంస్థ తరఫున సాయం చేస్తారు. అనాథల్ని కూడా అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పిస్తుంటారు.

ఏదో ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం మొక్కుబడిగా నడిపే సంస్థల తరహాది కాదు ‘అగరం’ ఫౌండేషన్. ఆ సంస్థను సందర్శిస్తే సూర్య ఫ్యామిలీది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. చెన్నైలోని ఖరీదైన ప్రాంతంలో సూర్య ఫ్యామిలీ ఎంతో కాలం నివసించిన పెద్ద ఇంటిని ఈ ఫౌండేషన్ లోని పిల్లల కోసం ఉదారంగా ఇచ్చేయడం విశేషం. ఇప్పటికే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన ‘అగరం’ తరఫున మరింత మందికి సాయపడాలని సూర్య నిర్ణయించాడు. ఏటా ఇకపై కొత్తగా 500 మంది కాలేజీ విద్యార్థులకు అండగా నిలుస్తామని ప్రకటించాడు. బాగా చదువుతూ ఉండి ఆర్థికంగా వెనుకబడిన 500 మంది ఎంపిక చేసి వారి చదువు.. ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నాడు. ఒక కుటుంబంలో ఒకరు బాగా చదివి పైకి వస్తే ఆ కుటుంబమే నిలబడుతుంది. తర్వాతి తరాలకూ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయం గుర్తించి ఇంతమందికి జీవితాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్న సూర్య కుటుంబానికి సెల్యూట్ చేయాల్సిందే.