Begin typing your search above and press return to search.

టీజర్ కోసమే అంత కష్టపడుతున్నాడా?

By:  Tupaki Desk   |   25 Feb 2016 11:30 AM GMT
టీజర్ కోసమే అంత కష్టపడుతున్నాడా?
X
సూర్య సినిమాలు హిట్టవచ్చు.. ఫ్లాప్ కావచ్చు.. కానీ ప్రతి సినిమాలోనూ అతడి ప్రయత్నం కనిపిస్తుంది. కష్టం కనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించాలని కష్టపడుతుంటాడు సూర్య. అందుకే కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేనప్పటికీ సూర్య మీద జనాలకు నమ్మకం సడలిపోలేదు. సూర్య కొత్త సినిమా ‘24’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య లాగే కమిట్మంట్ ఉన్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో బయటికి వచ్చిన రోజు నుంచి ఆసక్తి రేపుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఎంత సంచలనం రేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి ఒక్కో అవతారంలో షాకిచ్చాడు సూర్య. లేటెస్టుగా ప్రేమికుల రోజుల విడుదల చేసిన పోస్టర్లు కూడా అదుర్స్ అనిపించాయి.

ఇక ‘24’ టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ‘24’ టీజర్ రిలీజవ్వాల్సింది. కానీ వాయిదా పడింది. మార్చి తొలి వారంలో టీజర్ రిలీజవుతుందట. ఇలా వాయిదా పడటానికి కారణం లేకపోలేదు. టీజర్ మీద మూడు వారాలుగా పని చేస్తోందట చిత్ర బృందం. టీజరే చాలా గ్రాఫిక్ వర్క్ తో ముడిపడి ఉందట. ఊరికే నాలుగైదు షాట్లు కట్ చేసి మొక్కుబడిగా టీజర్ వదిలేయకుండా సినిమా స్థాయికి తగ్గట్లుగా ఇది ఉండాలని చాలా కష్టపడుతున్నాడట విక్రమ్. టీజర్ తోనే ప్రకంపనలు సృష్టించాలనే ఉద్దేశంతో సూర్య కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాడట. అందుకే ఈ ఆలస్యం. కాబట్టి సూర్య అభిమానులంతా ఓ మెస్మరైజింగ్ టీజర్ కోసం రెడీ అయిపోవచ్చు.