Begin typing your search above and press return to search.

సూర్య మరీ ఇంత వీక్ అయ్యాడా ?

By:  Tupaki Desk   |   30 May 2019 4:56 AM GMT
సూర్య మరీ ఇంత వీక్ అయ్యాడా ?
X
రేపు సూర్య ఎన్జికె (నంద గోపాల కృష్ణ) భారీ ఎత్తున విడుదల కానుంది. తమిళనాడులో ఏకంగా 215 అడుగుల కటవుట్ పెట్టి అభిమానులు ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే తెలుగులో మాత్రం దీని సందడి ఏ మాత్రం కనిపించడం లేదు. సాధారణంగా ఏ కొత్త సినిమా అయినా అడ్వాన్సు బుకింగ్ కళకళలాడే హైదరాబాద్ లాంటి కీలక కేంద్రాల్లో సైతం చాలా స్లోగా సీట్లు ఫుల్ అవుతున్నాయి. కాని మిగిలిన చోట్ల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.

జిల్లా కేంద్రాల్లో కనీసం 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. డబుల్ స్క్రీన్స్ వేసిన సెంటర్స్ గురించి చెప్పుకోకపోవడమే మంచిది. ఒక టైంలో బ్రదర్స్ సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలు రిలీజైనప్పుడు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడిన సందర్భాలు ఉన్నాయి. కాని అదంతా గత చరిత్ర. సూర్య మార్కెట్ ఎంత వీక్ అయిపోయిందో చూపించడానికి ఎన్జికె ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మన స్టార్లు లేక చప్పగా సాగిపోయింది. మీడియాకు దర్శకుడు శ్రీరాఘవ సూర్య ఇద్దరు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నా బాష సమస్య కారణంగా వాటిని ఇంగ్లీష్ లోనే నిర్వహిస్తూ ఉండటంతో పబ్లిక్ కి కనెక్ట్ కావడం లేదు. సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ లాంటి గ్లామర్ సపోర్ట్ ఉన్నా కూడా ఇంత లో బజ్ ఉండటం వింతే. ఒకపక్క ఫలక్ నుమా దాస్ యూత్ ని టార్గెట్ చేయగా హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా 2 పిల్లలను ఆకట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో చాలా బలమైన పాజిటివ్ వినిపిస్తే తప్ప ఎన్జికే గట్టెక్కడం కష్టమే. పైగా ప్రమోషన్లు చాలా ఆలస్యంగా మొదలుపెట్టడం కూడా సూర్యకు శాపంగా పరిణమించింది