Begin typing your search above and press return to search.

మూడు నెలల్లోనే మళ్లీ సూర్య బ్యాటింగ్

By:  Tupaki Desk   |   16 Jun 2016 10:05 AM IST
మూడు నెలల్లోనే మళ్లీ సూర్య బ్యాటింగ్
X
నెల కిందటే ‘24’ సినిమాతో సందడి చేశాడు సూర్య. బ్రదర్స్.. అంజాన్.. మాస్ సినిమాలు అంతగా ఆడకపోవడంతో వెనుకబడిపోయిన సూర్య.. ‘24’తో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. తెలుగుతో పోలిస్తే తమిళంలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. ‘24’ ఓవరాల్ గా సూర్యకు సంతృప్తినే ఇచ్చింది. ఈ ఊపులో తన తర్వాతి సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు సూర్య. ‘సింగం’ సిరీస్ లో భాగంగా రాబోతున్న మూడో సినిమా ‘ఎస్-3’.. ‘24’ విడుదలైన మూణ్నాలుగు నెలలకే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఈ ఆగస్టులోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సూర్య. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య కజిన్ జ్నానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.

గత ఏడాదే మొదలైన ‘ఎస్-3’ షూటింగ్ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయింది. సింగం.. సింగం-2 రెండూ కూడా సూపర్ హిట్లవ్వగా.. మూడో భాగాన్ని అంచనాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో రూపొందిస్తున్నాడట హరి. ఈ చిత్రం చాలా వరకు విదేశాల్లోనే సాగుతుందట. షూటింగ్ కూడా ఎక్కువగా విదేశాల్లోనే జరిగింది. అంటే నరసింహం ఈసారి పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎదిగిపోయాడన్నమాట. తొలి రెండు భాగాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించగా.. ఈసారి ఆ బాధ్యతలు హారిస్ జైరాజ్ తీసుకున్నాడు. జులై రెండో వారంలో ‘ఎస్-3’ ఆడియోను రిలీజ్ చేసి.. ఆగస్టు ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారని సమాచారం. ఇందులో సూర్యకు జంటగా అనుష్క- శ్రుతిహసన్ నటిస్తున్నారు.