Begin typing your search above and press return to search.

విశాఖ వాసుల్ని టెన్షన్ పెట్టేసిన సూర్య

By:  Tupaki Desk   |   9 July 2016 7:09 AM GMT
విశాఖ వాసుల్ని టెన్షన్ పెట్టేసిన సూర్య
X
ఉన్నట్లుండి మీరున్న ప్రాంతంలోకి వరుసబెట్టి పోలీసు కార్లు దూసుకొస్తే.. పదుల సంఖ్యలో పోలీసులు దిగితే.. వందల మంది జనాలు గుమిగూడితే టెన్షన్ పడిపోరూ. విశాఖపట్నం బీచ్ లో నిన్న సాయంత్రం అలాంటి పరిస్థితే తలెత్తింది. దీంతో అక్కడేదో జరిగిపోయిందని టెన్షన్ పడిపోయారు జనాలు. ఐతే పోలీస్ జీపులోంచి స్టయిల్ గా దిగిన వ్యక్తిని చూశాక వాళ్ల టెన్షన్ ఎగిరిపోయింది. అక్కడున్నది నిజం పోలీసులు కాదని.. సినిమా పోలీసులని.. అక్కడ సూర్య ‘సింగం-3’ షూటింగ్ జరుగుతోందని.. అందుకే ఆ హడావుడి అని కొంచెం లేటుగా తెలుసుకున్న జనాలు.. హమ్మయ్య అనుకుని షూటింగ్ ఆస్వాదించడం మొదలుపెట్టారు.

సూర్య ఎరుపు రంగు కారులో వచ్చి ఓ రౌడీని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి తరువాత కారులో వెళ్లిపోవాలి. ఇదీ సన్నివేశం. ముందు షూటింగ్ అని జనాలకు తెలియనివ్వకుండా నేచురల్ ఎఫెక్ట్ కోసమని.. హడావుడి లేకుండా సన్నివేశాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్ హరి. దీంతో ఇది షూటింగ్ అని తెలుసుకోవడానికి జనాలకు సమయం పట్టింది. ఈ సన్నివేశం కోసం ముందు ఎరుపు రంగు కారునే ఉపయోగించినప్పటికీ.. తిరిగి వెళ్లేటపుడు కారు స్టార్ట్ కాకపోవడంతో ఈ సీన్ రీషూట్ చేయాల్సి వచ్చింది. ముందు సూర్య తెలుపు రంగు కార్లోనే వచ్చినట్లు చూపించి.. తిరిగి వెళ్లడం కూడా ఆ కారులోనే చూపించారు. దీంతో ఈ సీన్ తీయడానికి అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టింది. గత కొన్నేళ్లుగా తన ప్రతి సినిమానూ తెలుగు రాష్ట్రాల్లో కొంత షూట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు సూర్య. ముఖ్యంగా వైజాగ్ లో ఏదో ఒక లొకేషన్ ను తన సినిమాలో చూపించడానికి ఇష్టపడతాడతను. మరోవైపు ‘సింగం-3’ షూటింగ్ కోసం వైజాగ్ విచ్చేసిన శ్రుతి హాసన్ కు ఈ ప్రాంతం తెగ నచ్చేసిందట. విశాఖ అందాల్ని ఆస్వాదిస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రుతి. బీచ్ అందాలకు ముగ్ధురాలైపోయిన శ్రుతి.. టాప్ యాంగిల్ నుంచి తీసిన ఓ పిక్‌.. దాంతో పాటు మరో ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది.