Begin typing your search above and press return to search.

రోలెక్స్ నోట RC 15..మెగాఫ్యాన్స్ లో పూన‌కాలే!

By:  Tupaki Desk   |   4 Aug 2022 9:30 AM GMT
రోలెక్స్ నోట RC 15..మెగాఫ్యాన్స్ లో పూన‌కాలే!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఐదు నిమిషాల రోలెక్స్ పాత్ర‌తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిపోయాడు. విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సూర్య ప్ర‌తిభ‌ను మెచ్చుతూ చేసిన వీడియో అత‌ని స్థాయిని మ‌రింత పెంచింది. ఇటీవ‌లే జాతీయ ఉత్త‌మ న‌టుడిగాను అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు సూర్య కెరీర్ లో 2022 లో చోటు చేసుకున్నాయి.

రోలెక్స్ పాత్ర‌తో మ‌రిన్ని అద్భుతాలు సృష్టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇక సూర్య టాలీవుడ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌ర‌భాషా న‌టుడైనా తెలుగు అభిమానులు ఎంతో అభిమానించే స్టార్. ఇక్క‌డ ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా అభిమానులున్నారు. సూర్య అంటే ఓ బ్రాండ్ గా కొన‌సాగుతున్నాడు.

తాజాగా ఈ సూప‌ర్ స్టార్ -మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 15వ చిత్రం గురించి స్పందించిన తీరు చూస్తే ఫ్యాన్స్ కి పూన‌కాలు త‌ప్ప‌వు. అవును త‌మిళ సినిమా 'విరుమ‌న్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈ సినిమా వేడుక‌కు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో పాటు సూర్య కూడా గెస్ట్ గా హాజ‌ర‌య్యారు.

సూర్య స్పీచ్ లో భాగంగా చ‌ర‌ణ్ సినిమా ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంకర్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. చ‌ర‌ణ్ సినిమా కోసం తెలుగు..త‌మిళ అభిమానులే కాక అన్ని రాష్ర్టాల అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్ప‌డం విశేషం. దీంతో మెగా అభిమానుల్లో ఒక్క‌సారిగా జోష్ మొద‌లైంది.

సూర్య‌లాంటి స్టార్ హీరో చ‌ర‌ణ్ సినిమా గురించి మాట్లాడ‌టంతో వాళ్ల ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఇక మెగా కాపౌండ్ తో సూర్య అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. గీత ఆర్స్ట్ లో అనువ‌దించిన 'గ‌జిని' సినిమాతోనే సూర్య తెలుగులో పెద్ద స్టార్ అయ్యారు. ఈ విష‌యాన్ని సూర్య ఎప్ప‌టిక‌ప్ప‌డు ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. ఆ సమ‌యంలో నిర్మాత అల్లు అర‌వింద్ ని ప్ర‌త్యేకంగా త‌లుచుకుంటారు.

సూర్య గురించి చ‌ర‌ణ్ ..చిరంజీవిలు సైతం మెచ్చిన సంద‌ర్భాలెన్నో. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ అదే శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న 'ఇండియాన్ -2' గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. దీంతో కోలీవుడ్ మీడియాలో ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చిన‌ట్లు అవుతుంది.

శంక‌ర్ ని కోలీవుడ్ త‌క్కువ అంచ‌నా వేస్తుందా? అన్న సందేహాన్ని సూర్య వ్యాఖ్య‌లు బ‌ల‌ప‌రిచినట్లు అవుతుంద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తుంది. కోలీవుడ్ బ‌డా సంస్థ‌ల అశ్ర‌ద్ద కార‌ణంగా శంక‌ర్ తెలుగు సినిమాల‌వైపు మ‌న‌సు మ‌ళ్లించిన‌ట్లు ఇప్ప‌టికే ప్రచారంలో ఉంది. 'ఇండియాన్-2' వివాదం అందుకు ఆజ్యం పోసిన‌ట్లు ప్ర‌చారం సాగింది.