Begin typing your search above and press return to search.

వరల్డ్ నెం.1 మూవీగా రికార్డ్ సృష్టించిన సూర్య ''జై భీమ్''

By:  Tupaki Desk   |   10 Nov 2021 4:40 AM GMT
వరల్డ్ నెం.1 మూవీగా రికార్డ్ సృష్టించిన సూర్య జై భీమ్
X
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ''జై భీమ్'' ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలై అశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గిరిజనులు, అణగారిన వర్గాలకు చెందిన అమాయకపు ప్రజలపై కొందరు పోలీసులు అన్యాయంగా చేసే దాడిని ఈ చిత్రంలో చూపించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.

అంతర్జాతీయ సినిమా రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) సినిమాల జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ వచ్చిన మూవీగా ''జై భీమ్'' టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 56 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌ పాయింట్స్ తో IMDB లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 97 శాతానికి పైగా గూగుల్‌ యూజర్లు ఈ చిత్రాన్ని లైక్ చేశారని తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయ్యే సినిమాలకు ‘ఐఎమ్‌డీబీ’ సంస్థ ద్వారా యూజర్లు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ 1994లో విడుదలైన 'ది షాషాంక్ రిడంప్షన్‌' సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు దాన్ని రెండో స్థానానికి నెట్టి ''జై భీమ్‌'' టాప్ పొజిషన్ లో నిలిచింది. 'గాడ్‌ ఫాదర్‌' సినిమా మూడో స్థానంలో.. 'డార్క్ నైట్' నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇకపోతే గతేడాది అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సూర్య సినిమా 'ఆకాశం నీ హద్దురా' సైతం IMDB టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు ''జై భీమ్‌'' సినిమాతో సూర్య మరోసారి ఘనత సాధించారు.

కాగా, ''జై భీమ్'' చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య - జ్యోతిక కలిసి నిర్మించారు. ఇందులో సూర్య తో పాటుగా మణికందన్ - లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించారు. ముగ్గురూ తమ పాత్రల్లో అవార్డ్ విన్నింగ్ పెరఫార్మన్స్ ఇచ్చారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - రజిషా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎస్ ఆర్ కాథిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'కేజీయఫ్' ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు-అరివ్ యాక్షన్ కంపోజ్ చేశారు. ''జై భీమ్'' సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.