Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన ప్రముఖులు..!

By:  Tupaki Desk   |   14 Jun 2020 5:56 PM GMT
సుశాంత్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన ప్రముఖులు..!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం సినిలోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సుశాంత్‌ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్ ఉందని భావించిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి రాజకీయ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వారు సుశాంత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సుశాంత్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ మోదీ ట్విట్టర్‌ లో పోస్ట్‌ పెట్టారు. ''బ్రైట్ యంగ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనల్ని విడిచి త్వరగా వెళ్ళిపోయాడు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో సుశాంత్‌ అద్భుతంగా నటించేవాడు. ఎంటెర్టైన్మెంట్ వరల్డ్ లో ఆయన ఎంతోమందికి స్పూర్తి. సుశాంత్ జ్ఞాపకార్థంగా నిలిచిపోయే ఎన్నో గుర్తుండిపోయే ప్రదర్శనలు వదిలివెళ్లాడు. ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ట్వీట్‌ లో పేర్కొన్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ''సుశాంత్ మ‌ర‌ణం నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. మ‌న మాన‌సిక స్థితి స‌మంగా ఉండే విధంగా చూసుకోవాల‌ని.. మ‌నం ఇష్ట‌ప‌డేవారికి మ‌న మాన‌సిక స్థితి గురించి వెల్ల‌డించేందుకు ఎప్పుడూ వెన‌కాడ‌కూడ‌ద‌ని'' ట్వీట్ చేశారు. సెంట్రల్ మినిస్టర్స్ రాజ్ నాథ్ సింగ్.. స్మృతి ఇరానీ, కేరళ సీఎం విజయన్ సుశాంత్ మృతికి సంతాపం ప్రకటించారు. క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్ వీవీఎస్ లక్ష్మణ్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సుశాంత్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధించారు.

టాలీవుడ్ సినీ ప్రముఖులు సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సుశాంత్ అద్భుతమైన నటుడు అని.. సుశాంత్ ఇక లేడని తెలిసి తీరని వేదన కలిగిందని పేర్కొన్నారు. మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ''సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్ అకాల మరణం గురించి తెలుసుకొని షాక్ అయ్యాను. అతను టాలెంట్ కి ఒక పవర్ హౌస్... చాలా చిన్న వయసులో వెళ్ళిపోయాడు... అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ ''జేమ్స్ డీన్ మరియు హీత్ లెడ్జర్ మరణం తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాకు షాకింగ్ విషయం.. దేవుడు బాలీవుడ్‌ కు శాపం పెట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ ఎప్పుడూ అనుభవించని అత్యంత షాకింగ్ ఘటన ఇది.. ఇంత చిన్న వయసులో చాలా లైఫ్ ముందుంచుకొని ఇలా ఎందుకు చేసాడు???'' అని ట్వీట్ చేసారు. వెంకటేష్, ప్రకాష్ రాజ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్, సమంత, నమ్రత, కీర్తి సురేష్, రాశీ కన్నా, ఇలియానా, నిధి అగర్వాల్, మంచు మనోజ్, సుధీర్ బాబు, ధనుష్, కాజల్ అగర్వాల్, నివేతా థామస్, సునీల్, అల్లు శిరీష్, మెహ్రీన్, సాయి ధరమ్ తేజ్, సుశాంత్, తాప్సి, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, సోనూ సూద్, సందీప్ కిషన్, నితిన్, నారా రోహిత్, నవీన్ పోలిశెట్టి, అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, మలినేని గోపీచంద్, శ్రీను వైట్ల సోషల్ మీడియా వేదికగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంతాపం ప్రకటించారు.