Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ది హత్య అనుకుంటున్నా : ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

By:  Tupaki Desk   |   30 July 2020 10:50 AM GMT
సుశాంత్‌ ది హత్య అనుకుంటున్నా : ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ మరణం ఓ మిస్టరీని తలపిస్తూ రోజుకొక మలుపు తిరుగుతోంది. డిప్రెషన్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది అంటుంటే ఆయన్ని హత్య చేశారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్‌ సింగ్‌ సూసైడ్ పై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ ను హత్య చేశారని ఆరోపిస్తూ ఆయన ముంబై పోలీసుల ఎఫ్‌.ఐ.ఆర్‌ పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఓ డాక్యుమెంట్‌ ను ట్విటర్‌ లో పోస్ట్‌ చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని చెప్తున్నాయని పేర్కొన్నారు.

స్వామి డాక్యుమెంట్‌ ప్రకారం సుశాంత్‌ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని.. ఇది హత్యని సూచిస్తోందని అన్నారు. సుశాంత్‌ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకొని ఉంటే.. సోషల్ మీడియా ద్వారా అంతకుముందు ఏదైనా విషయాన్ని చెప్పి ఉండాలి. ఒక క్లోత్ ఉపయోగించి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అనుకున్నప్పటికీ అతని గొంతుపై ఉన్న గుర్తులు అందుకు తగ్గట్లుగా లేవు. అంతేకాకుండా శరీరంపై అనేక చోట్ల మార్క్స్.. సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం.. రూమ్ డూప్లికేట్ కీ మిస్సింగ్.. సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య.. సిమ్ కార్డులు మార్చడం.. నో ఫైనాన్సియల్ క్రైసెస్, అతని సర్వెంట్ స్టేట్మెంట్ మొదలైనవి హత్య జరిగి ఉండొచ్చుననే విషయాలను తన డాక్యుమెంట్ లో తెలియజేశారు.

అంతేకాకుండా ''ముంబై పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతున్నారా లేదా.. సుశాంత్ సింగ్ యొక్క అసహజ మరణంపై దర్యాప్తులో బీహార్ పోలీసులు తీవ్రంగా మాట్లాడితే సీబీఐకి దర్యాప్తుకు ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల పోలీసులు ఒకే నేరాన్ని విడిగా పరిశోధించలేరు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని 80 శాతం మంది ముంబై పోలీసులు కోరుతున్నారు'' అని ట్వీట్ చేసారు. ఇక రియాపై స్పందిస్తూ.. ఆమె తన పని తాను చేసుకుంది కాని ఆమె ఇప్పుడు డిస్పెన్సబుల్ గా మారుతుందని ఆమె గ్రహించలేదు అని ట్వీట్ చేసారు.

కాగా ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సుబ్రహ్మణ్య స్వామి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రధానికి ఆయన లేఖ కూడా రాశారు. అయితే నిన్న సుశాంత్‌ మరణంపై ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తో మాట్లాడటం.. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ఉండదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ ముఖ్ ప్రకటించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే సుబ్రహ్మణ్య స్వామి సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సుశాంత్‌ మరణానికి రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.