Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ మేనేజ‌ర్ మ‌ర‌ణంపై సిట్ ద‌ర్యాప్తు?

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:12 AM GMT
సుశాంత్ సింగ్ మేనేజ‌ర్ మ‌ర‌ణంపై సిట్ ద‌ర్యాప్తు?
X
బాలీవుడ్ లో రెండు వ‌రుస మ‌ర‌ణాలు అప్ప‌ట్లో తీవ్ర ప్ర‌కంప‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వీటిలో ఒక‌టి వ‌ర్థ‌మాన యువ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కాగా.. మ‌రొక‌టి అత‌డి మేనేజ‌ర్ దిశా సాలియ‌న్ అనుమానాస్మ‌ద మ‌ర‌ణం. ఈ రెండిటిపైనా ఇప్ప‌టికీ చిక్కుముడులు వీడ‌లేదు. పోలీసుల ద‌ర్యాప్తు కోర్టు విచార‌ణ‌లు సాగుతూనే ఉన్నాయి. ఇందులో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌మేయానికి సంబంధించిన కోణంపైనా ఇప్పుడు గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌ముఖ‌ సెలబ్రిటీ మేనేజర్ దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్-ఫ్రెండ్ దిశా సాలియన్ మరణం కేసు ఇప్పుడు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. గురువారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మృతి కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.

8 జూన్ 2020న దిశా సాలియన్ (28) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి కొన్ని రోజుల ముందు మరణించింది. ఈ మ‌రణం కూడా అనుమానాస్ప‌ద మృతిగానే న‌మోదు చేసి విచార‌ణ కొన‌సాగించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై ఎలాంటి స్ప‌ష్ఠ‌త రాలేదు. కానీ ఇప్పుడు మ‌రోసారి దీనిపై విచార‌ణ జ‌రిపేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. సిట్ ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ఫడ్నవీస్ తాజా ప్ర‌క‌ట‌న‌లో హామీ ఇచ్చారు. అసెంబ్లీలో నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఫడ్నవీస్ ఏమ‌న్నారంటే.... "ఈ కేసు ఇప్పటికే ముంబై పోలీసుల వద్ద ఉంది. రుజువులు ఉన్నవారు వాటిని అందించండి. సిట్ ఈ కేసును విచారిస్తుంది" అని అన్నారు. విచారణ నిష్పక్షపాతంగా ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ కూడా ఎటువంటి రాజకీయ కోణం నుండి ఈ కేసును చూడ‌బోమ‌ని హామీ ఇచ్చార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే ఈ కేసులో ఆదిత్య ఠాక్రేకు నార్కో టెస్టు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే డిమాండ్ చేశారు. ఈ కేసు గురించి మొదటి నుండి చాలా పెద్ద స్వ‌రంతో గొంతు విప్పిన బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే.. మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాకరే ఆ రోజు దిశా సలియన్ పార్టీలో ఉన్నార‌ని ఆరోపించారు. తప్పనిసరిగా అత‌డు నార్కో పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశారు. "దిశా స‌లియ‌న్ కి సంబంధించిన‌ చివరి పోస్ట్ మార్టం నివేదిక ఇంకా రావలసి ఉంది. మొత్తం ఛార్జ్ షీట్ తాలూకా పేజీలు(పుస్త‌కం) ఇంకా సిద్ధం కాలేదు. ఆదిత్య థాకరే కు నార్కో పరీక్ష తప్పనిసరిగా చేయాలి" అని నితీష్ రాణే డిమాండ్ చేసారు.

ఇంతకుముందు ఈ కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా దర్యాప్తు నిర్వహించిన సంగ‌తి విధిత‌మే. నవంబర్ లో అపెక్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమె మరణాన్ని ప్రమాద వ‌శాత్తూ జ‌రిగిన‌దిగా పేర్కొంది. జూన్ 8వ తేదీ రాత్రి దిశా పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తోంది. మద్యం సేవించిన సలియన్ బ్యాలెన్స్ తప్పి త‌న‌ ఫ్లాట్ పారాపెట్ నుండి జారిపడ్డారు! అని సిబిఐ అధికారి మీడియాకు తెలిపారు.

అలాగే ఈ విచార‌ణ ప్ర‌కారం.. దిశా సాలియన్ మ‌ర‌ణంతో SSR దురదృష్టకర మరణానికి ఎటువంటి సంబంధం లేదు.. సలియన్ .. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాలు ఏదో ఒకవిధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయనేవి కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని సీబీఐ అధికారి పేర్కొన్నారు. సీబీఐ అధికారి మాట్లాడుతూ- "సాలియన్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున.. రెండు మరణాలకు సంబంధం ఉన్నట్లు వాదనలు వచ్చినందున.. సాలియన్ కొంతకాలం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం మేనేజ‌ర్ గా పనిచేసినందున.. ఆమె మరణంపై స‌వివరంగా విచారించాం. కానీ అలాంటి లింక్ (అనుమానం క‌లిగించేలా) ఏదీ కనుగొనలేదు" అని తెలిపారు.

సలియన్ ఎలా చనిపోయింది? అంటే..సిబిఐ నివేదిక‌ ప్రకారం.. సలియన్ తన సన్నిహితుల కోసం పార్టీని ఏర్పాటు చేసింది. సాయంత్రం నుండి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తరువాత సోషల్ మీడియాలో కనిపించాయి. కానీ ఈ పార్టీలో మ‌త్తుతో తూగుతూ ఆమె బాల్కనీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.. అని ద‌ర్యాప్తు లో పేర్కొన్నారు.

త‌న మేనేజ‌ర్ అకాల మ‌ర‌ణం తర్వాత సుశాంత్ సింగ్ పూర్తిగా దుఃఖానికి గుర‌య్యాడు. ఆత్మహత్యకు ముందు వారంలో త‌న గురించి అలాగే సాలియన్ పై క‌థ‌నాల గురించి గూగుల్ లో సుశాంత్ సెర్చ్ చేశాడని తెలిసింది. ప్ర‌స్తుతం దిశా సాలియ‌న్ కేసును సిట్ ద‌ర్యాప్తు చేసే అవ‌కాశం ఉంది. ఇందులో ఒక‌వేళ రాజ‌కీయ నాయ‌కుల వార‌సుల ప్ర‌మేయంపైనా విచార‌ణ జ‌రిగేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.