Begin typing your search above and press return to search.

మాజీ విశ్వసుందరిని కోర్టుకీడ్చిన కారు

By:  Tupaki Desk   |   18 Sep 2017 4:58 PM GMT
మాజీ విశ్వసుందరిని కోర్టుకీడ్చిన కారు
X
మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్‌ కారు కొనుగోలు వ్యవహారంలో కోర్టు మెట్లెక్కారు. ముంబయిలో నివసించే ఆమె తమిళనాడులోని ఎగ్మూర్‌ కోర్టులో సోమవారం హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కాగా తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం ముందుకు వచ్చారు.

2005లో విదేశాల నుంచి ల్యాండ్‌ క్రూయిజర్ కారును దిగుమతి చేసుకున్న ఆమె ట్యాక్సులను తగ్గించుకునేందుకు గాను తప్పుడు వివరాలు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ కేసులోనే ఇప్పుడు ఆమె ఎగ్మూరు కోర్టులో అటెండయ్యారు. రూ. 55 లక్షలకు ఆమె ల్యాండ్ క్రూయిజర్ ను కొనుగోలు చేశారు, అయితే, అది 2004లో తయారైనట్లు చెన్నై హార్బర్‌లో నమోదు చేశారు. దాని టాక్స్‌కు సంబంధించి తప్పుడు లెక్కలు చూపినట్లు హార్బర్‌ కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

దీంతో ఆ కారును దిగుమతి చేసిన ముంబాయికి చెందిన హరన్, బండారి తమలాలపై కేసు నమోదు చేశారు. కారు కొనుగోలు చేసిన సుస్మితను సాక్షిగా చూపించారు. అయితే ఆ కారుకు సంబంధించి సుస్మితాసేన్‌ రూ.20.31 లక్షలను పన్నును చెల్లించారు. ఈ విషయంలో ఆమెను కస్టమ్స్‌ అధికారులు సాక్షిగా పేర్కొనడంతో గతంలో ఒకసారి ఎగ్మూర్‌ కోర్టుకు హాజరై తాను చెల్లించిన పన్ను ఆధారాలను సమర్పించి వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసులో నిందితులను క్రాస్‌ ఎగ్జామ్‌ చేయడానికి మరోసారి కోర్టుకు హాజరవ్వాల్సిందిగా సుస్మితాసేన్‌కు పలుసార్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో సుస్మిత ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నటి సుస్మితాసేన్‌ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో సోమవారం ఉదయం సుస్మితాసేన్‌ ఎగ్మూర్‌ కోర్టుకు హాజరయ్యారు. మొత్తానికి కారు ఆమెను కోర్టుకీడచ్చిందన్నమాట.