Begin typing your search above and press return to search.

ట్రాన్స్ జెండర్ గా సుష్మితా సేన్.. విమర్శలపై డైరెక్టర్ స్పందిస్తారా?

By:  Tupaki Desk   |   31 Oct 2022 2:30 AM GMT
ట్రాన్స్ జెండర్ గా సుష్మితా సేన్.. విమర్శలపై డైరెక్టర్ స్పందిస్తారా?
X
బాలీవుడ్ బ్యూటీ.. మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ 'తాలీ(చప్పట్లు)' అనే వెబ్ సిరీసులో నటిస్తున్నారు. ముంబైకి చెందిన గౌరీ సావంత్ అనే ట్రాన్స్ జెండర్ జీవితాధారంగా దర్శకుడు సఖీ చార్ చౌఘి 'తాలీ' వెబ్ సిరీసును తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీసులో సుష్మితా సేన్ ట్రాన్స్ జెండర్ గా కన్పించనుంది.

ఈ వెబ్ సిరీసులో తన లుక్కుకు సంబంధించిన తాజా పోస్టర్ ను సుష్మితా సేన్ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. అయితే దీనిపై ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలోని పలువురు అభ్యంతరం చేస్తున్నారు. గౌరీ సావంత్ పాత్రను రియల్ ట్రాన్స్ జెండర్ తో నటింప జేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో ట్రాన్స్ జెండర్ పాత్ర ఉన్నప్పుడు తమ లాంటి వారికి అవకాశాలు కల్పించవచ్చు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ జెండర్లలోని చాలా మంది సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని వారంటున్నారు. అయితే ఇలాంటి పాత్రలను కూడా ఇతరులతో చూపించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే విషయంపై ప్రముఖ మోడల్.. ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ట్రాన్స్ జెండర్ నవ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఒక సినిమా ఆడిషన్ జరుగుతుండగా బెస్ట్ ఫ్రెండ్‌ పాత్ర కోసం ఆడిషన్ కు వెళ్లినట్లు చెప్పారు. ఈ ఆడిషన్‌లో తాను ఎంతో ఆత్మవిశ్వాసంతో, అక్కడి వారి దృష్టిని ఆకర్షించేలా ఉన్నట్లు తెలిపారు.

తనకు ఇచ్చిన డైలాగులన్నీ ఆడిషన్లో మరచిపోకుండా చెప్పానని తెలిపారు. అయితే చివరికి ఓ డైరెక్టర్ తనతో నువ్వు ఆడానా? మగనా? అని ప్రశ్నించారని వాపోయారు. ఆయన మాటలతో తన మనస్సు విరిగిపోయిందని.. ఇలాంటి కఠినమైన మాటలు తనకు కొత్త కాదని నవ్య తెలిపారు. ఇలాంటి వాటిని తట్టుకోవడం అంత సులువు కాదని ఆమె వెల్లడించారు.

తనకు 18ఏళ్లు ఉన్నప్పుడు బీహార్ నుంచి ముంబైకి వచ్చినట్లు నవ్య తెలిపారు. ఓ రోజు సాయంత్రం తన తల్లితో తన మనసులోని మాటను వెల్లడించినట్లు తెలిపారు. ''నేను అబ్బాయిని కాదు.. అమ్మాయిననని నా మనసు చెబుతోంది' అని చెప్పింది. అయితే తమది సంప్రదాయ కుటుంబమని దీంతో ఆడ, మగ తప్ప మరో జెండర్ ఉందని నమ్మేవారు కాదన్నారు.

ముంబైకి వచ్చాక మహి అనే మరో ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడిందన్నారు. మహి ద్వారా ముంబైలోని ఎల్జీబీటీ కమ్యూనిటీతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా పోటీ ఫైనల్స్‌కు వెళ్లారు. భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించే అతిపెద్ద అందాల పోటీ ఇదే కావడం విశేషం.

ఆ తర్వాత 'సావధాన్ ఇండియా' అనే క్రైమ్ సిరీస్‌లో ట్రాన్స్ వుమన్ పాత్ర దక్కిందని తెలిపారు. ఇందులో నటన తర్వాత తనకు మంచి గుర్తింపు దక్కిందని తెలిపారు. ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ పై సినిమా తీస్తున్నట్లు తెలిసి చాలా సంబర పడినట్లు తెలిపారు. ఈ పాత్రను తమ లాంటి వారికి వస్తుందని భావించినట్లు తెలిపారు.

అయితే ఈ పాత్రను సుష్మితా సేన్ కు ఇస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించడం బాధ కలిగించిందన్నారు. ఇలాంటి పాత్రలకైనా తమ లాంటి వారికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నవ్య వ్యక్తం చేశారు. ట్రాన్స్ జెండర్ల విమర్శలపై 'తాలి(చప్పట్లు)' దర్శకుడు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!