Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్‌ఆర్‌' చివరి వరకు ఈ సస్పెన్స్‌ తప్పదా?

By:  Tupaki Desk   |   16 Aug 2021 8:30 AM GMT
ఆర్ఆర్‌ఆర్‌ చివరి వరకు ఈ సస్పెన్స్‌ తప్పదా?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. ఉక్రెయిన్ నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు తిరిగి వచ్చేసినట్లుగా ఉన్నారు. షూటింగ్ కు ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు. హైదరాబాద్ లో మళ్లీ షూటింగ్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి తాజాగా హైదరాబాద్ లో కనిపించడంతో ఉక్రెయిన్ షెడ్యూల్‌ ముగిసిందని తేలిపోయింది. ఇక విడుదలకు నిండు రెండు నెలలు కూడా లేదు. షూటింగ్‌ పూర్తి అయిన రెండు నెలలకు సినిమాలు విడుదల అవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. కాని జక్కన్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావడం అంటే దాదాపుగా అసాధ్యం. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చాలా నెలల సమయం తీసుకుని విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్‌ ను మాత్రం అక్టోబర్‌ 13న విడుదల చేస్తామని చెబుతున్నారు.

విడుదల తేదీ విషయంలో ఇప్పటికి కొందరికి అనుమానాలు ఉన్నాయి. జక్కన్న సినిమా దసరా సీజన్ లో రాబోతుందని కొందరు అనుకుంటున్నారు. కాని కొందరు మాత్రం ఖచ్చితంగా జక్కన్న సినిమా రాదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా రాజమౌళి సినిమా అక్టోబర్ లో వస్తుందా రాదా అనే విషయమై ఖచ్చితంగా రాదనే సమాధానం చెబుతున్నారు. ఇటీవల పాట విడుదల సందర్బంలో అయినా అంతకు ముందు మేకింగ్‌ వీడియో విడుదల చేసిన సమయంలో అయినా సినిమాను విడుదల చేయబలేక పోతున్నాం అని.. కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. కాని అదే దసరా సీజన్ కు వస్తుందని చెప్పడంతో మొదట వస్తుందేమో అనిపించింది. కాని థియేటర్ల పరిస్థితి మరియు ఇతర కరోనా పరిస్థితులు చూస్తుంటే కొందరు సినీ అభిమానులు ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు రిలీజ్ కాకపోవడం మంచిది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్‌ వరకు థియేటర్లు మళ్లీ పూర్తి స్థాయిలో ఆరంభం అవుతాయా అంటే డౌటే అన్నట్లుగా ఉంది. కరోనా కు భయపడుతున్న జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు. కనుక వారు అంతా కూడా థియేటర్లకు వస్తారా అనేది అనుమానం. అందుకే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అయ్యి.. జనాల్లో కరోనా భయం పోయే వరకు ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను వాయిదా వేయడం మంచిది. దసరా సీజన్ లో వస్తే మాత్రం వసూళ్లు 30 నుండి 50 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏది అయితే అదే అన్నట్లుగా విడుదల చేస్తారా అనేది చూడాలి. వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా బయర్లు నిర్మాత దానయ్యను మరియు దర్శకుడు రాజమౌళి ని విడుదల విషయంలో ఒత్తిడి చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కొత్త విడుదల తేదీ ప్రకటించే విషయంలో తొందరపడవద్దని యూనిట్‌ మెంబర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే అక్టోబర్ వరకు కూడా ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. జనాలు విడుదల విషయంలో అప్పటి వరకు సస్పెన్స్ తో వెయిట్‌ చేయాల్సిందే అంటూ యూనిట్‌ మెంబర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రాజమౌళి ని సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మంది ఎన్నో విధాలుగా విడుదల తేదీ విషయంలో ప్రశ్నిస్తున్నారు. ఆయన మాత్రం మౌనమే నా సమాధానం అన్నట్లుగా ఉంటున్నారు.