Begin typing your search above and press return to search.

భయమనేది నా నరంలో లేదు

By:  Tupaki Desk   |   11 Dec 2021 11:30 PM GMT
భయమనేది నా నరంలో లేదు
X
తెలుగు ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలను అందించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. 90వ దశకంలో వరుస హిట్లను అందించిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. కొబ్బరి బొండాం .. మాయలోడు .. రాజేంద్రుడు గజేంద్రుడు .. యమలీల .. శుభలగ్నం .. ఘటోత్కచుడు వంటి సూపర్ హిట్లు ఆయన జాబితాలో కనిపిస్తాయి. అప్పటివరకూ కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. దర్శకత్వం చేసినవారున్నారు. కానీ వాటితో పాటు సంగీతాన్ని కూడా అందించిన ప్రతిభ కృష్ణారెడ్డి సొంతం. అలాంటి కృష్ణారెడ్డి పాల్గొన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఈ ఆదివారం ప్రసారం కానుంది.

"అప్పట్లో ఏవో వేషాలు వేద్దామని నేను అనుకోలేదు .. ఏకంగా హీరో అయిపోదామనే ఉద్దేశంతోనే నేను మద్రాసు వెళ్లాను. అచ్చిరెడ్డి నా క్లాస్ మెట్ .. సినిమాల్లోను మా ప్రయాణం కలిసే సాగింది. ఇప్పటికీ ఆయన నా కూడానే ఉంటాడు. మొదటి నుంచి కూడా నాకు భయం అనే నరం లేదు. అందువల్లనే ప్రయోగాలు చేయగలిగాను. అలీని హీరోగా పెట్టి 'యమలీల' సినిమా చేయడానికి కారణం కూడా ఆ భయం లేకపోవడమే.

ఇప్పటి ఆడియన్స్ సెటిమెంట్ సినిమాలు చూసే పరిస్థితి లేదని అంటున్నారు. అలాంటి సినిమాలు మాత్రమే తీయడం నాకు చేతనవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు?. నా సినిమాల్లో కావలసినంత కామెడీ ఉంటుంది .. ఎమోషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా అదే పద్ధతిలో ఉంటాయి. చాలా మంది తమ కెరియర్ అయిపోయిందని అనుకుని ఉండవచ్చు. నేను అలా కాదు .. నిన్నటి గురించి ఈ రోజు చెప్పుకోకూడదు .. నిరంతరం పోతాడుతూనే ఉండాలనేది నా అభిప్రాయం.

అలీనీ హీరోగా పెట్టి 'యమలీల'ను సక్సెస్ చేయగలిగాను .. నేను హీరోగా ఎందుకు సక్సెస్ కాలేదని మీరు అడుగుతున్నారు. హీరోను కావాలని నేను ఎప్పటి నుంచో కలలు కనేవాడిని. నా మీద నేను పడ్డ ఆశను ఒక్కసారన్నా తీర్చుకోకపోతే ఎట్లాగా. స్వీట్ కంపెనీ పెట్టుకుని .. నెలకి 3 వేల రూపాయలు వస్తున్నాయి గదా అని దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుని ఉంటే, కృష్ణారెడ్డి అనేవాడు కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. సంగీతం .. దర్శకత్వం అందించగలడా? 40 సినిమాలు చేయగలడా? అంటూ తనకి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలుగా ఆయన చెప్పుకొచ్చారు.