Begin typing your search above and press return to search.

నేను కూడా సినిమా కష్టాలు పడ్డాను: ఎస్వీ కృష్ణారెడ్డి

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 PM GMT
నేను కూడా సినిమా కష్టాలు పడ్డాను: ఎస్వీ కృష్ణారెడ్డి
X
టాలీవుడ్ ప్రేక్షకులకు కుటుంబ కథాచిత్రాలను ఎక్కువగా అందించిన దర్శకుల జాబితాలో ఎస్వీ కృష్ణారెడ్డి పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఆయన పేరు వినగానే రాజేంద్రుడు గజేంద్రుడు .. మాయలోడు .. యమలీల .. మావిచిగురు వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి.

దర్శకులు తమ సినిమాలకు రచయితలుగా మారిపోవడం .. తమ సినిమాలకు నిర్మాతలుగా ఉండటం సహజం. కానీ తమ సినిమాలకి తామే సంగీతాన్ని సమకూర్చుకున్న దర్శకులు చాలా అరుదు. అలాంటివారి సరసన కూడా ఎస్వీ కృష్ణారెడ్డి పేరు కనిపిస్తుంది.

తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమం ద్వారా ఎస్వీ కృష్ణారెడ్డి తనకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

"తూర్పుగోదావరి జిల్లాలోని 'కొంకుదురు' అనే విలేజ్ మాది .. మా ఊరు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్లి వస్తూనే ఉంటాను. ఆ వీధులు .. ఆ మనుషులు అంటే చాలా చాలా ఇష్టం. నేను మా ఊరిని అంతగా ఇష్టపడానికి మరో కారణం ఉంది. మా నాన్న తాపీమేస్త్రీ .. అక్కడి శివాలయాన్ని ఆయనే కట్టారు. ఆయన ఆ ఆలయాన్ని కడుతున్నప్పుడు నేను ఇటుకలు అందించాను.

అందువలన ఆ గుడి అంటే నాకు ఎంతో ఇష్టం .. అది ఒక ఎమోషనల్ ఎటాచ్ మెంట్. అందరిలాగానే నేను సినిమాల్లో ట్రై చేయడానికి చెన్నై వెళ్లాను .. అక్కడ సినిమా కష్టాలు పడ్డాను. అయితే ఆ భగవంతుడి దయవలన ఆకలితో గడిపే రోజులు ఎప్పుడూ రాలేదు. ఆశ .. నిరాశల మధ్య ఊగిసలాట మాత్రం అనుభవించాను.

ఒక దశాబ్దకాలం వరకూ అలాగే గడిపాను. 'పగడాల పడవ' అనే ఒక సినిమా విషయంలో బాకీలను కూడా నేనే చెల్లించవలసి వచ్చింది. ఆ సినిమా దాదాపు విడుదల కాలేదనే చెప్పాలి. ఆ సమయంలో ఈ సినిమాల గోల మనకి ఎందుకులే అనుకుని వెనక్కి వెళ్లిపోయాను కూడా.

చదువుకునే రోజుల్లో అచ్చిరెడ్డి నాకు జూనియర్ .. ఇద్దరం మంచి స్నేహితులం. 'నువ్వు ఏదో ఒక రోజున తప్పకుండా సక్సెస్ అవుతాను అనే నమ్మకం నాకు ఉంది' అంటూ నాకు అచ్చిరెడ్డి ధైర్యం చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయాణం మొదలుపెట్టాము.

హీరో కావాలనే ఉద్దేశం మనసులో బలంగా ఉన్నప్పటికీ, దర్శకుడిగా మారవలసి వచ్చింది. కిషోర్ రాఠిగారితో కలిసి సినిమాలు మొదలుపెట్టాం. స్కూటర్ నుంచి కారుకి, చిన్నగది నుంచి కాస్త పెద్ద ఇంటికి మారాము. అక్కడి నుంచి కాస్త పుంజుకున్నాము" అని చెప్పుకొచ్చారు.