Begin typing your search above and press return to search.

విలక్షణమైన నటనకు 47 ఏళ్లు!

By:  Tupaki Desk   |   23 Nov 2021 10:30 AM GMT
విలక్షణమైన నటనకు 47 ఏళ్లు!
X
యుద్ధరంగంలోకి అడుపెట్టిన తరువాత గెలిచేవరకూ పోరాడవలసిందే. పారిపోయి వచ్చినవారిని ఊరు హేళన చేస్తుంది. గెలిచి వస్తే అదే ఊరు బ్రహ్మరథం పడుతుంది. ఈ విషయం బాగా తెలుసును గనుకనే, మోహన్ బాబు చిత్రపరిశ్రమలో పెట్టిన అడుగును వెనక్కి తీయలేదు. మోహన్ బాబు సినిమాల్లోకి రావడానికి ముందు .. సినిమాల్లో నిలదొక్కుకునేంత వరకూ సినిమా కష్టాలే పడ్డారు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఎన్నో అవమానాలను భరించారు. అలాంటి పరిస్థితుల్లోనే 'స్వర్గం నరకం' సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చింది.

'స్వర్గం నరకం' సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. భక్తవత్సలం నాయుడు అనే పేరును ఆయనే మోహన్ బాబుగా మార్చారు. ఏ దర్శకుడు కూడా ఒక కొత్త కుర్రాడిని హీరోగా పెట్టి రిస్క్ చేయడానికి ఇష్టపడడు. అలాంటిది అప్పట్లో ఆయనను హీరోగా పెట్టి దాసరి నారాయణరావు 'స్వర్గం నరకం' సినిమాను రూపొందించారు. ఈ సినిమాతోనే మోహన్ బాబు ఎవరనేది అందరికీ తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తనకి హీరోగా అవకాశం ఇవ్వడమే కాకుండా, తన పేరును మార్చి .. తనకి స్టార్ డమ్ తీసుకొచ్చిన దాసరిని ఆయన ఇప్పటికీ తన గురువనే చెబుతుంటారు.

అలాంటి 'స్వర్గం నరకం' సినిమా 1975 నవంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఆ సినిమా వచ్చి .. నటుడిగా మోహన్ బాబు ప్రయాణం ప్రారంభమై నిన్నటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సినిమా తరువాత కెరియర్ పరంగా మోహన్ బాబు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. దాసరి నారాయణరావు కూడా ఆ ఒక్క సినిమాతో ఆయనను పరిచయం చేసి ఊరుకోలేదు. హీరోగాను .. విలన్ గాను మోహన్ బాబుతో విలక్షణమైన పాత్రలను చేయిస్తూ వచ్చారు. తన డైలాగ్ డెలివరీతో .. కామెడీ టచ్ ఉన్న విలనిజంతో మోహన్ బాబు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

విలన్ వేషాలతో మెప్పించిన మోహన్ బాబు, హీరోగా తనని తాను నిరూపించుకోవడం కోసం నిర్మాతగాను మారారు. సొంత బ్యానర్లో వరుస హిట్ లు చేస్తూ వెళ్లారు. అలా హీరోగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన ' సన్నాఫ్ ఇండియా' అనే సినిమాను చేస్తున్నారు. అలాగే తాను మాత్రమే చేయగలనని అనిపించే కీలకమైన పాత్రలను కూడా చేస్తున్నారు. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన ఆయన, 'పద్మశ్రీ'ని అందుకున్నారు. తనని తాను మలచుకున్న శిల్పంలా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.