Begin typing your search above and press return to search.

పృథ్వికి పోస్టు తిప్పలు.. డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నారట

By:  Tupaki Desk   |   5 Aug 2019 9:54 AM GMT
పృథ్వికి పోస్టు తిప్పలు.. డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నారట
X
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొదవ లేదు. అయితే.. కొందరికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. టైమింగ్ పంచ్ తో పాటు.. రిథమ్ తో .. డైలాగుల్ని చెప్పే నటుల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఒకరు. ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటమే కాదు.. ఆయన అగ్రెసివ్ వ్యాఖ్యలతో చంద్రబాబు వర్గం కిందా మీదా పడిన పరిస్థితి. పృథ్వి పడిన కష్టానికి ఫలితంగా పవర్లోకి వచ్చిన అనంతరం జగన్ ప్రభుత్వం ఆయన్ను ఎస్వీబీసీ (శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ) ఛైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జగన్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. పృథ్వి ఆనందానికైతే హద్దుల్లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడాయన కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పొజిషన్ ను అప్పజెప్పిన నేపథ్యంలో ఆయనకు సినిమాల్లో నటించే అవకాశాలు ఇచ్చే విషయంలో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త పాత్రలు ఇచ్చేందుకు ముందుకు రాని వైనం అంతకంతకూ పెరుగుతోంది.

ఇదంతా ఒకఎత్తు అయితే.. ఛానల్ ఛైర్మన్ గా పదవిని కేటాయించటానికి ముందే.. పలువురు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారట. ఛానల్ ఛైర్మన్ గా మారిన తర్వాత.. ఆయన చేత పని చేయించుకోవటం కష్టమన్న వాదనను దర్శక నిర్మాతలు వినిపిస్తున్నాయి. ఛానల్ ఛైర్మన్ బాధ్యతలతో తలమునకలైన నేపథ్యంలో.. షెడ్యూల్ సమయానికి ఆయన వస్తారో? రారో? ఒకవేళ రాకున్నా ఏమీ అనలేం.. అందుకే.. లేని తలనొప్పులు నెత్తిన వేసుకున్నా.. అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు ఇష్టపడటం లేదంటున్నారు. అందుకే.. కొత్త అవకాశాలు పృథ్వికి రావట్లేదు. అయితే.. తనకు వచ్చిన పదవిని తనకిచ్చే సినిమా అవకాశాలతో అస్సలు పోలిక పెట్టొద్దని స్పష్టం చేస్తున్నారు పృథ్వి. తాను చిత్రపరిశ్రమకు చెందిన వాడినని.. తన తుదిశ్వాస ఉన్నంతవరకూ ఇండస్ట్రీతోనే ఉంటానని.. పదవిని చూసి.. ఛాన్సులు ఇవ్వకపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే తన పని తాను చేస్తానన్న మాటను చెబుతున్నారు. మరి.. పృథ్వి వినతిని నిర్మాతలు ఎంతమేర మన్నిస్తారో చూడాలి.