Begin typing your search above and press return to search.

సైరాను ప్రేక్షకుల తీర్పునకు వదిలేయాలన్న హైకోర్టు

By:  Tupaki Desk   |   1 Oct 2019 9:52 AM GMT
సైరాను ప్రేక్షకుల తీర్పునకు వదిలేయాలన్న హైకోర్టు
X
ఏ ముహుర్తంలో మొదలైందో కానీ సైరా మూవీ చిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఓపక్క పరిశ్రమతో పాటు.. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఈ సినిమా మీద వ్యక్తమైంది. అదే సమయంలో.. ఈ సినిమాను చుట్టుముట్టిన వివాదాలు.. న్యాయపరమైన చిక్కులు అన్ని ఇన్ని కావు. అయితే.. వీటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తున్న సైరా టీంకు తాజాగా హైకోర్టు స్పందన భారీ రిలీఫ్ గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం ఉండదు.

భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాకు తెలంగాణ హైకోర్టు ఓకే చెప్పేసింది. ఈ సినిమా విడుదలను తాము ఆపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సైరాను తొలుత బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడుచరిత్ర అంటూ తప్పుదారి పట్టిస్తున్నారంటూ తమిళనాడు తెలుగు యువత సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

సినిమాను కేవలం వినోదంగానే చూడాలని.. ఎంతోమంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ చూపించలేరని.. సినిమాటిక్ గా ఉండటం కోసం కొంత కల్పితం కూడా ఉంటుందన్న ధర్మాసనం.. సినిమా విషయంలో తాము జోక్యం చేసుకోమని తేల్చేసింది.

గతంలో గాంధీ.. మొఘల్ సామ్రాజ్యాధినేతల మీద తీసిన చిత్రాల్లోనూ కొంత కల్పితం ఉందన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. సినిమా నచ్చేది.. నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలన్న కోర్టు.. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూనిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న సైరా టీంకు హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు మరింత స్థైర్యాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదు.