Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో సైరా సౌండ్ ఏది?

By:  Tupaki Desk   |   20 Sep 2019 1:30 AM GMT
బాలీవుడ్ లో సైరా సౌండ్ ఏది?
X
ప్రభాస్ 'సాహో' తర్వాత భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న టాలీవుడ్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి 'సైరా'. అయితే ఈ సినిమాపై తెలుగులో బజ్ ఉంది కానీ హిందీలో పెద్దగా రెస్పాన్స్ లేదు. 'సైరా' టీజర్ రిలీజ్ ను భారీ స్థాయిలో చేయడం.. ముంబైలో టీజర్ లాంచ్ చేయడంతో అప్పట్లో 'సైరా' పై ఆసక్తి కనిపించింది. అప్పట్లో చిరంజీవి.. చరణ్ ఇంటర్వ్యూలు కూడా నేషనల్ మీడియాలో వచ్చాయి. అప్పటి పరిస్థితిని చూస్తే 'సైరా' ను హిందీలో భారీగా ప్రమోట్ చేస్తారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్ లాంచ్ సమయంలో మాత్రం ఆ హంగామా లేనేలేదు.

నిజానికి ప్యాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసుకోవడం సులువే కానీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆ సినిమాపై ఆసక్తి కలిగేలా చేయడం మాత్రం చాలా కష్టం. ఈ విషయంలో ఎలాంటి ఫిలిం మేకర్ అయినా ఎస్ఎస్ రాజమౌళి స్ట్రేటజీని ఫాలో కావాల్సిందే. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ సమయంలో రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ ఫిలింమేకర్స్ అందరికీ ఒక రూల్ బుక్.. రూట్ మ్యాప్ లాంటివి. 'సాహో' టీమ్ కూడా ఆ విషయంలో సక్సెస్ అయింది. అయితే 'సైరా' ట్రైలర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఎక్కువమంది ఈ సినిమాను గుర్తించలేదు. మెజారిటీ బాలీవుడ్ మీడియా కూడా 'సైరా' ను పెద్దగా పట్టించుకోలేదు.

అమీర్ ఖాన్ లాంటి కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు 'సైరా' ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు కానీ 'సైరా' టీమ్ మాత్రం అలాంటి వాటిని ప్రమోషన్ కు వాడుకోవడంలో చాలా స్లోగా ఉంది. సినిమాకు ఇక రెండువారాలు కూడా లేని సమయంలో 'సైరా' టీమ్ ఇలా వ్యవహరించడం వల్ల బాలీవుడ్ లో ఈ సినిమాకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ. నిజానికి ఈ ప్రమోషన్స్ విషయంలో నిర్మాత రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. ఈ పది రోజులు స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేసినా ప్యాన్ ఇండియన్ ఫిలిం టాగ్ ఉంటుందని.. అలా కాకపోతే ఇది జస్ట్ ఓ తెలుగు సినిమాలాగానే మిగిలిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి 'సైరా' టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.