Begin typing your search above and press return to search.

సైరా టిక్కెట్టు బాదుడు షురూ!

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:22 AM GMT
సైరా టిక్కెట్టు బాదుడు షురూ!
X
మోస్ట్ అవైటెడ్ `సైరా- న‌ర‌సింహారెడ్డి` ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడులో అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. ఇటు ద‌క్షిణాది రాష్ట్రాల‌ను మించి అటు ఉత్త‌రాదిన అత్యంత క్రేజీగా రిలీజ్ చేసేందుకు త‌డీనీల‌తో క‌లిసి ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. అలాగే ఓవ‌ర్సీస్ లో అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర అమెరికాలో అంతే భారీగా సైరాను రిలీజ్ చేయ‌నున్నారు. నేటి సాయంత్రం రిలీజ‌వుతున్న ట్రైల‌ర్ తో సైరా ఫీవ‌ర్ మ‌రింత‌గా రాజుకుంటుంద‌ని మెగాభిమానులు భావిస్తున్నారు.

మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు బాదుడు ఎలా ఉండ‌బోతోందోనన్న ఆందోళ‌నా కామ‌న్ ఆడియెన్ లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌లే `సాహో` టిక్కెట్టు ధ‌ర‌ల్ని అమాంతం పెంచి అమ్ముకున్నారు. కొన్నిచోట్ల అనుమ‌తులు లేక‌పోయినా రేట్లు పెంచార‌ని గ‌డ‌బిడ నడిచింది. తెలంగాణ‌లో టిక్కెట్టు ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తి రాక‌పోవ‌డంతో యువి బృందం ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే హీరోల క్రేజును బ‌ట్టి కొంత భారీ బ‌డ్జెట్లు పేరుతో అనుమ‌తులు తెచ్చుకుని టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు సాధ్య‌మేన‌ని ప్రూవ్ చేస్తున్నారు. వీట‌న్నిటినీ మించి థియేట‌ర్ య‌జ‌మానులే తొలి వారం టిక్కెట్ల‌ను బ్లాక్ లో విక్ర‌యించేయ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. అక్టోబ‌ర్ 2న రిలీజ్ కానున్న సైరా న‌ర‌సింహారెడ్డి స‌న్నివేశ‌మేంటి? అంటే... తెలుగు రాష్ట్రాల్లో య‌థావిధిగా తొలి వారం టిక్కెట్టు పెంపున‌కు అనుమ‌తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది.

మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా` అమెరికాలోనూ అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. అక్క‌డ ఇప్ప‌టికే టిక్కెట్ల ధ‌ర‌ల్ని ఫిక్స్ చేశార‌ట‌. ఒక్కో టిక్కెట్టుకి పెద్ద‌ల‌కు 28 డాల‌ర్లు.. పిల్ల‌ల‌కు 18 డాల‌ర్లు ఫిక్స్ చేశారు. భారీ ఐమ్యాక్స్ ల్లో చూడాలంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించాలి. అలా కాకుండా మామూలు సాధాసీదా స్క్రీన్ల‌కు అయితే పెద్ద‌ల‌కు 25 డాల‌ర్లు .. పిల్ల‌ల‌కు అయితే 15 డాల‌ర్లు టిక్కెట్టుపై ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే మంగ‌ళ‌వారం నాడు అయితే ఒక టిక్కెట్ కొంటే ఇంకో టిక్కెట్టు ఉచితం అంటూ ఆఫ‌ర్ పెట్టారు. ఈ ఆఫ‌ర్ పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని పంపిణీదారులు భావిస్తున్నారు. అమెరికాలో తెలుగు-త‌మిళం-హిందీ వెర్ష‌న్లు ప్ర‌ముఖంగా ఎక్కువ స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తార‌ని కొణిదెల కాంపౌండ్ స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.