Begin typing your search above and press return to search.

'సై' ర‌న్ మోగితే కొద‌మ‌సింహం

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:12 AM GMT
సై ర‌న్ మోగితే కొద‌మ‌సింహం
X
వార్‌ లో దిగితే వ‌న్‌ సైడైపోవాలి. శ‌త్రువు ఎంత‌టివాడు అన్న‌ది అస్స‌లు క‌నిపించ‌కూడ‌దు. ఏది మ‌ర‌ణం? ఏది శాశ్వ‌తం? అన్న‌దే యుద్ధ‌వీరుడి ల‌క్ష‌ణం. క‌ద‌న‌రంగంలో క‌దంతొక్కి శ‌త్రువు గుండెల్ని చీల్చాలి. క‌త్తి వాటం చూపించాలి. శ‌రం సంధిస్తే కుత్త‌కలు ఎగిరిప‌డాలి. ర‌ణ‌భూమిలా జాలి - ద‌య అన్న ప‌దాలే వినిపించ‌కూడ‌దు. త‌మవారిని కాపాడుకోవాలంటే ప్రాణ‌త్యాగానికైనా సిద్ధం కావాలి. అలాంటి విరోచిత పోరాటం చేశాడు కాబ‌ట్టే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే వీరుడికి ప్ర‌త్యేకించి ఓ చ‌రిత్ర లిఖించ‌బ‌డి ఉంది. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని వీరాధివీరుడి క‌థ ఇది. మెగాస్టార్ రూపంలో ఉయ్యాల‌వాడ బ‌తికి వ‌స్తున్నాడు. అది సైరాతో సాధ్య‌మ‌వుతోంది.

ఇదిగో ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థం కావ‌డం లేదూ? తెల్లోడి గుండెల్లోకి క‌త్తి దూసే కొద‌మ సింగంలా దూకుతున్న ఈ ఉగ్ర‌న‌ర‌సింహుడి అవ‌తారం క‌నిపించ‌డం లేదూ? ఆ క‌ళ్ల‌లోనే క్రౌర్యం దాగి ఉంది. క‌త్తి ఎత్తితే ఒక్క ఉదుటున ప‌ది త‌ల‌కాయ‌లు తెగి ప‌డాల్సిందేన‌న్న ఉగ్ర‌రూపం క‌నిపిస్తోంది. ఉయ్యాల‌వాడ బ‌రిలో దిగితే శ‌త్రువు ఎలా ఒణికిపోతారో ఆ పోస్ట‌ర్‌ లో చూపించారు జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే. తెల్లోళ్లు నిశ్చేష్ఠులై చూడాల్సిందే. పొదల్లోంచి దూసుకొస్తాడో - లేక ఇంకెక్క‌డి నుంచి ఎప్పుడు ఎలా విరుచుకుప‌డ‌తాడో అర్థం కాని క‌న్ఫ్యూజ‌న్‌ లో ఉండ‌గానే త‌ల‌లు తెగి నేల‌కొర‌గాల్సిందే. ఎన్ని బాణాలు దూసుకొచ్చినా న‌ర‌సింహుని క‌త్తి లాఘ‌వం ముందు అవ‌న్నీ తూలిప‌డాల్సిందే.

ముఖ్యంగా ఉయ్యాల‌వాడ గెట‌ప్‌ - కాస్ట్యూమ్స్‌ని అభినందించి తీరాల్సిందే. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్ ఆ లుక్‌ లో క‌నిపించింది. ఆ కాస్ట్యూమ్స్‌ లోని ఘాడ‌త ఆక‌ట్టుకుంది. లెద‌ర్ ఉప‌యోగించి ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన క‌వ‌చం చూడ‌గానే చైనీ సినిమా `వార్ ఆఫ్ యారోస్` గుర్తుకు రావాల్సిందే. ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది మెగాడాట‌ర్ సుశ్మిత‌. త‌న‌తో పాటు వేరొక డిజైన‌ర్ ఉన్నార‌ని చ‌ర‌ణ్ స్వ‌యంగా చెప్పారు. కాస్ట్యూమ్స్ స‌హా మెగాస్టార్ లుక్ 200ప‌ర్సంట్ యాప్ట్‌ గా క‌నిపిస్తోంది. ఉయ్యాల‌వాడ‌కు మెగాస్టార్ త‌ప్ప వేరొక‌రిని ఊహించ‌లేం అన్నంతగా ఆ గెట‌ప్ సెట్ట‌య్యింది.