Begin typing your search above and press return to search.

తప్పుదిద్దుకున్నా ఫలితం లేదు.. నాగబాబుపై పోలీస్ కంప్లైంట్

By:  Tupaki Desk   |   20 May 2020 4:23 PM GMT
తప్పుదిద్దుకున్నా ఫలితం లేదు.. నాగబాబుపై పోలీస్ కంప్లైంట్
X
మెగా బ్రదర్ నాగబాబు చాలా పెద్ద సమస్యలోనే చిక్కుకున్నారని చెప్పక తప్పదు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి పెను వివాదం రేపిన నాగబాబు.. ఆ వివాదం నుంచి తక్షణమే తప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించేలా కనిపించడం లేదు. ఎందుకంటే నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండగా... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఏకంగా నాగబాబుపై పోలీసుకు ఫిర్యాదు చేసేదాకా వెళ్లిపోయింది. ఈ మేరకు టీకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్... నాగబాబుపై కేసు నమోదు చేయాలంటూ ఉస్మానియి వర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం నాడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా గాడ్సేను కీర్తించడమే కాకుండా ఆయనను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లు వచ్చిన వెంటనే దాదాపుగా అన్ని వర్గాల నుంచి నాగబాబుపై దండయాత్ర మొదలైపోయింది. జాతిపితను హత్య చేసిన గాడ్సే దేశభక్తుడు ఎలా అయ్యాడో చెప్పాలంటూ చాలా మంది నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఈ తరహా విమర్శలు వెల్లువలా రావడంతో నాగబాబు మేల్కొన్నారు. బుధవారం ఉదయమే... తన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకోకండి అని, గాడ్సే చేసిన నేరాన్ని తాను ఎక్కడా సమర్ధించలేదని నాగబాబు ఏకంగా క్షమాపణలు చెప్పినంత పని చేశారు.

అయితే గాంధీని హత్య చేసేన గాడ్సేను వెనకేసుకురావడంతో పాటుగా ఆయనను గొప్ప దేశభక్తుడిగా కీర్తించిన నాగబాబు.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. నాగబాబుపై ఓ వైపున విమర్శలు వెల్లువలా వచ్చిపడుతుంటే... మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏకంగా నాగబాబుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం మొదలెట్టేసింది. అంతేకాకుండా ఏకంగా ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మానవతారాయ్ ఏకంగా నాగబాబుపై కేసు నమోదు చేేయాలని ఫిర్యాదు చేశారు. ఈ తరహాలోనే నాగబాబుపై మరిన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సింగిల్ ట్వీట్ తో నాగబాబు పెద్ద ప్రమాదంలోనే పడిపోయారని చెప్పక తప్పదు.