Begin typing your search above and press return to search.

ఆ హీరో పై విరుచుకుపడిన ఆ సీనియర్

By:  Tupaki Desk   |   14 May 2018 9:52 AM GMT
ఆ హీరో పై విరుచుకుపడిన ఆ సీనియర్
X
తమిళ సినిమాల్లో చిన్న స్థాయి హీరోగా ప్రయాణం మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. కేవలం నటుడిగా మిగిలిపోకుండా నిర్మాణంలోకి వచ్చాడు. ఆ తర్వాత సినీ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. నడిగర్ సంఘం కార్యదర్శి అయ్యాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ గెలిచాడు. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి కీలక బాధ్యతల్ని నెత్తికెత్తుకుని పోరాటం చేస్తున్నాడు. ఐతే తెలుగువాడైన విశాల్.. తమిళ సినీ పరిశ్రమలో ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయించడం నచ్చక అతడిని వ్యతిరేకించే వాళ్లకు కూడా కొదవలేదు. అందులో శింబు.. అతడి తండ్రి టి.రాజేందర్ కూడా ఉన్నారు. గతంలో వీళ్లిద్దరూ విశాల్‌ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మరోసారి రాజేందర్.. విశాల్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాడు. విశాల్ అంటే అస్సలు పడని సీనియర్ దర్శకుడు భారతీరాజా.. సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో కలిసి రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టాడు.

ఇటీవలే ముగిసిన కోలీవుడ్ సమ్మెకు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించాడు రాజేందర్. సమ్మె అనంతరం ఇకపై ఏ సినిమా అయినా 200 స్క్రీన్లకు మించి రిలీజ్ చేయొద్దని నిర్ణయించారని.. కానీ ఈ నిబంధనను సడలించి విశాల్ కొత్త సినిమా ‘ఇరుంబుతురై’ని 300 థియేటర్లలో ఎలా రిలీజ్ చేశారని ప్రశ్నించాడు రాజేందర్. అలాగే తమిళ సినిమాల్ని పైరసీతో గట్టి దెబ్బ తీస్తున్న ‘తమిళ్ రాక్సర్’ అంతు చూస్తానన్న విశాల్.. దాని విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాడని ప్రశ్నించారు. ఆ వెబ్ సైట్ వాళ్లతో విశాల్ కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. తమళ నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం.. క్యూబ్ ఛార్జీలు తగ్గించడం లాంటి అంశాలపైనా రాజేందర్ విశాల్ కు అనేక ప్రశ్నలు సంధించాడు. ఐతే విశాల్ చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాడని.. ఐతే అన్ని సమస్యలూ రాత్రికి రాత్రే పరిష్కారం అయిపోవని... అతడి మీద అక్కసుతో ఇలా ఆరోపణలు చేస్తున్నారనే వాళ్లూ లేకపోలేదు. సినీ పరిశ్రమలో మెజారిటీ వ్యక్తులు విశాల్ వైపే ఉన్నట్లు సమాచారం. రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి వాళ్లు విశాల్ పక్షమే అని అక్కడి వాళ్లంటారు.