Begin typing your search above and press return to search.

విజయ్ ది ఎంత పెద్ద మనసో చూశారా?

By:  Tupaki Desk   |   4 Aug 2015 11:34 AM GMT
విజయ్ ది ఎంత పెద్ద మనసో చూశారా?
X
ఒకప్పటితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి కొంచెం బెటరే కావచ్చు కానీ.. ఇప్పటికీ హీరోల అభిమానుల మధ్య గొడవలు తక్కువేమీ కాదు. అవతలి హీరోను, అతడి అభిమానుల్ని ధ్వేషిస్తేనే నిజమైన అభిమాని అనుకునే చాలా మంది ఉన్నారిప్పుడు. ఓ హీరో సినిమా విడుదలవుతుంటే ఆ హీరో యాంటి ఫ్యాన్స్ కూడా యాక్టివ్ అయిపోతారు. ఆ హీరో మీద విషం కక్కడానికి సోషల్ మీడియా వాళ్లకు మంచి వేదిక అవుతుంది. ఈ విషయంలో టాలీవుడ్ కొంచెం బెటరే కానీ.. కోలీవుడ్ లో మాత్రం యాంటీ ఫ్యాన్స్ వికృత చేష్టలు మామూలుగా ఉండవు. రజినీకాంత్, కమల్ హాసన్ నిజంగా ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలుసు. కానీ వాళ్ల అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఐతే ఈ సీనియర్ హీరోలు జోరు తగ్గించేసినట్లే అభిమానులు కూడా కొంచెం తగ్గారు.

ఇప్పుడు ప్రధాన వైరం విజయ్, అజిత్ అభిమానుల మధ్యే. సోషల్ మీడియాలో ఈ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంటుంది. తాను అజిత్ ఫ్యాన్ అని చెప్పుకున్నందుకు శింబు మీద కూడా విషం కక్కడం మొదలుపెట్టారు విజయ్ ఫ్యాన్స్. అతడికి యాంటీగా ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లో పెద్ద ప్రచారమే చేశారు. ఐతే విజయ్ మాత్రం అభిమానుల్లా కాకుండా చాలా హుందాగా ప్రవర్తించాడని.. తన కొడుకును ఆదుకున్నాడని టి.రాజేందర్ బాహాటంగా ఆ హీరోపై ప్రశంసల జల్లు కురిపించారు. శింబు ‘వాలు’ సినిమా పెద్ద ఇబ్బందుల్లో పడి విడుదల పదే పదే వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మధ్యే ఆ చిక్కులు తొలగిపోయాయి. దీనికి విజయే కారణం అంటూ ‘పులి’ ఆడియో ఫంక్షన్లో ఆ హీరోను ఆకాశానికెత్తేశాడు రాజేందర్. ‘‘నా కొడుకు ఏ హీరో అభిమానో విజయ్ కు తెలుసు. వాలు సినిమాలో ఆ హీరో మీద ఓ పాట కూడా పెట్టాడు. ఆ హీరో విషయంలో విజయ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో కూడా తెలుసు. కానీ విజయ్ ఇదేమీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకుకు సాయపడ్డాడు. అతడిది చాలా పెద్ద మనసు’’ అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు. రాజేందర్ ఎమోషన్ చూసి.. కింది నుంచి విజయ్ వేదిక ఎక్కి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు.