Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల‌పై క‌ళాబంధు అస‌హ‌నం దేనికి?

By:  Tupaki Desk   |   4 Sep 2019 8:19 AM GMT
స్టార్ హీరోల‌పై క‌ళాబంధు అస‌హ‌నం దేనికి?
X
అవార్డు కార్య‌క్ర‌మాలంటే మ‌న స్టార్ హీరోల‌కు ఏహ్య‌భావ‌మా? అందువ‌ల్ల‌నే అవార్డులు తీసుకునేందుకు రావ‌డం లేదా? ఒక‌ప్ప‌టిలా ప్ర‌తిదానికీ ఎగేసుకుని వ‌చ్చే సంస్కృతి పోయిందా? ఇలా ఎన్నో సందేహాలొస్తున్నాయి. తాజాగా సీనియ‌ర్ నిర్మాత-క‌ళాబంధు టి.సుబ్బ‌రామ‌రెడ్డి ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. మన హీరోల తీరుతెన్నుల‌పై వేసిన పంచ్ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్- ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవారు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

టీఎస్సార్ అవార్డుల ప్ర‌స్థానం గురించి తెలిసిందే. ఇర‌వై ఏళ్లుగా క‌ళారంగంలో ప్ర‌ముఖుల‌కు ఆయ‌న ప‌లు పుర‌స్కారాల్ని అందించారు. సెప్టెంబర్ 16- 17 తేదీల్లో ఆయ‌న జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈసారి స‌హ‌జ‌న‌టి జయసుధకు `అభినయ మయూరి` అనే అవార్డును ఇస్తున్నారు. ఇందుకోసం 17 సెప్టెంబ‌ర్ వైజాగ్ లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పైవిధంగా స్పందించారు.

ఎన్టీఆర్- ఏఎన్నార్ ల‌తో పోలుస్తూ ఆయ‌న‌ నేటి త‌రం హీరోల‌పై పంచ్ వేయ‌డం వైర‌ల్ గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``గ‌తంలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఏ అవార్డు వ‌చ్చినా గ్ర‌హీత త‌ప్ప‌కుండా వేడుక‌కు అటెండ‌య్యి తీసుకునేవారు. కానీ నేడు ఆ స‌న్నివేశం లేదు. అవార్డుల‌కు దూరంగా ఉంటున్నారు. కొంత మంది అయితే త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఆహ్వానించినా రావ‌డం లేదు. ఆ విష‌యం వాళ్ల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా`` అని టీఎస్సార్ తీవ్రంగా మండి ప‌డ్డారు. అన్న‌ట్టు టీఎస్సార్ అవార్డుల కార్య‌క్ర‌మానికి మ‌న హీరోల్ని ఆహ్వానించినా అందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదా? అంటూ మీడియాలో సందేహం వ్య‌క్త‌మైంది. అయితే ఇటీవ‌లే జ‌రిగిన సైమా వేడుక‌ల‌కు అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి- మోహ‌న్ లాల్ వంటి స్టార్లు అటెండ‌య్యారు. అవార్డుల స్థాయిని బ‌ట్టి కూడా గౌర‌వం ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ అయిన టీఎస్సార్ ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు అవార్డులిచ్చి గౌర‌వం ఇస్తున్నారు. ఆయ‌న‌పై గౌర‌వంతో ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా అవార్డుల‌కు విచ్చేస్తున్నారు క‌దా? మ‌రి ఆయ‌న ఎందుకు ఈ కామెంట్లు చేశారు? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.