Begin typing your search above and press return to search.

నెగెటివిటీ చూడవద్దని దర్శకేంద్రులే చెప్పారట!

By:  Tupaki Desk   |   13 Jun 2019 5:23 PM GMT
నెగెటివిటీ చూడవద్దని దర్శకేంద్రులే చెప్పారట!
X
తాప్సీ పన్ను కొత్త సినిమా 'గేమ్ ఓవర్' జూన్ 14 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో తాప్సీ బిజీగా ఉంది. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో మీడియాకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాప్సీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన తనకు ఎదురయ్యే రెగ్యులర్ ప్రశ్నల్లో ఒకటి సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు గారిపై తాప్సీ చేసిన కామెంట్లపైనే.

రొమాన్స్ పేరుతో హీరోయిన్ల బొడ్డుపైకి పూలను.. పండ్లను హీరోల చేత వేయించే సీన్లను తీస్తారని.. అది కాస్తా తన వంతు వచ్చేసరికి కొబ్బరికాయ గా మారిందని గతంలో తాప్సీ కామెంట్ చేసింది. తాప్సీ డెబ్యూ ఫిలిం 'ఝుమ్మంది నాదం' డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. హీరోయిన్ గా తొలి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పైనే కామెంట్లు చేయడం వివాదం మారింది. తాజాగా ఆ వివాదం గురించి ప్రస్తావిస్తే.. రాఘవేంద్రరావు గారికి తనకు ఇప్పటికీ చాలా మంచి రిలేషన్ ఉందని.. ఇప్పటికీ రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటామని తాప్సీ తెలిపింది. ఈ కామెంట్లలో నెగెటివిటీ చూడవద్దని.. వాటి గురించి మాట్లాడడం మానెయ్యమని రాఘవేంద్రరావు సర్ తనకు చెప్పారని.. తమ మధ్య ఎలాంటి ఇబ్బంది లేదని.. ఈ వివాదం పనీపాట లేని వారు కల్పించినదేనని చెప్పింది.

సెన్సిటివ్ గా ఉండేవారు.. తమకు తోచినట్టు అర్థాలు తీసుకునేవారు.. నెగెటివ్ ఆలోచనలు ఉన్నావారు.. తన కామెంట్లలో తప్పులను వెతుకుతూ అనవసరమైన వివాదం సృష్టిస్తున్నారని తెలిపింది. తనకు రాఘవేంద్రరావు గారిపట్ల కానీ సౌత్ సినిమాల పట్లగానీ తక్కువ అభిప్రాయం లేదని తెలిపింది. అటు తాప్సీ బాగానే ఉంది.. ఇటు రాఘవేంద్రరావు గారు బాగానే ఉన్నారు.. మరి తాప్సీ కొబ్బరి కాయ - బొడ్డు కామెంట్లకు తప్పుడు అర్థాలు తీసిన పనిలేని జనాలు ఎవరో మరి. అంతా బాగుంది కానీ నిప్పు లేనిదే పొగరాదన్న సంగతి తాప్సీ మర్చిపోయిందా?!