Begin typing your search above and press return to search.

షాక్ ట్రీట్‌: ఆన్ లైన్ టిక్కెటింగ్ ఇక బంద్

By:  Tupaki Desk   |   21 Sep 2019 11:54 AM GMT
షాక్ ట్రీట్‌: ఆన్ లైన్ టిక్కెటింగ్ ఇక బంద్
X
గ‌త కొంత‌కాలంగా తెలంగాణ‌లో సినిమాపై కంట్రోల్ స‌న్నివేశం సినీపెద్ద‌ల‌కు కొట్టొచ్చిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు- మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లలో దోపిడీపై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ గా దృష్టి సారించింది. ఆ క్ర‌మంలోనే మాల్స్ - మ‌ల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఛార్జీల బాదుడుకు అడ్డుక‌ట్ట వేసింది. గంట గంట‌కో ఛార్జీ పేరుతో నిలువు దోపిడీని అరిక‌ట్ట‌డంతో థియేట‌ర్ య‌జ‌మానులు మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మానులు గ‌గ్గోలు పెట్టారు. పార్కింగు ఫీజు ఆదాయం ఒక్క‌సారిగా ప‌డిపోవ‌డంతో న‌ష్టాల్లో ఉన్నాం మ‌హాప్ర‌భో అంటూ ల‌బోదిబోమ‌న్నారు. అయినా తెలంగాణ ప్ర‌భుత్వం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఏమాత్రం దిగి రాలేదు. థియేట‌ర్ సిండికేట్ల ముకుతాడు వేసేందుకు చేయాల్సింది అంతా చేశారు.

ఇదొక్క‌టే కాదు థియేట‌ర్ల‌లో తిండి ప్ర‌దార్థాలు.. కోలాల‌పై వ‌సూలు చేస్తున్న బిల్లులు.. టిక్కెట్టుపై ప్ర‌భుత్వానికి చెల్లిస్తున్న ప‌న్ను వ‌గైరా వ‌గైరా వ్య‌వ‌హారాల‌పై తెలంగాణ అధికారులు తీవ్రంగానే దృష్టి సారించారు. ప్ర‌తిఫ‌లంగా సేక‌రించిన విలువైన స‌మాచారంతో నేడు ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది టీ-ప్ర‌భుత్వం. ఇక‌పై ఆన్ లైన్ లో సినిమా టిక్కెటింగ్ ని బంద్ చేయ‌నున్నామ‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప్ర‌క‌టించ‌డం సంచ‌లన‌మైంది. అధికారికంగా టిక్కెట్ల అమ్మ‌కాల‌పై ప్ర‌భుత్వ‌మే ఓ ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయ‌నుంద‌ని ఆయ‌న‌ తెలిపారు. 18-20 లైన్స్.. 8-10 లైన్స్ వ‌ర‌కూ సిట్టింగ్ ఏర్పాటు తామే(ప్ర‌భుత్వం) చూస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వమే టిక్కెట్ల అమ్మ‌కాలు చేప‌డితే నిర్మాత‌లు- పంపిణీదారుల‌కు న‌ష్టాలు త‌గ్గుతాయ‌ని అన్నారు.

సినీప‌రిశ్ర‌మ నుంచి కోట్ల‌లో ప‌న్ను ఆదాయం వ‌స్తోంది. దానికి కాపాడుకునే వెసులుబాటు కూడా పెరుగుతుంద‌ని మంత్రివ‌ర్యులు ఆశాభావం వ్య‌క్తం చేశారు. మొత్తానికి సినిమా ప‌రిశ్ర‌మ పేరుతో థియేట‌ర్ల‌పై కంచె వేసి ఆర్జిస్తున్న వారికి నెమ్మ‌దిగా చెల్లు చీటీ ర‌చిస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇదివ‌ర‌కూ ఆన్ లైన్ టిక్కెటింగును ప్రోత్స‌హించిన ఇదే మంత్రి వ‌ర్యులు ఇప్పుడిలా అర్థాంత‌రంగా దానిని ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌ర‌మేంటో అంతు చిక్క‌డం లేదు. ఈ వ్య‌వ‌స్థ‌లో ప‌న్ను దోపిడీ దారులు గ‌జ‌క‌ర్ణ గోక‌ర్ణ విద్య‌లు తెలిసిన క‌నిక‌ట్టు బాబుల‌కు చెక్ పెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణ‌య‌మా ఇది? ఇటీవ‌ల స‌మీక్షల్లో ఏం తేల్చారు? అన్న చ‌ర్చా ప్ర‌స్తుతం వేడెక్కిస్తోంది.