Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్‌...త‌ల‌సాని షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   8 July 2018 4:53 PM GMT
కాస్టింగ్ కౌచ్‌...త‌ల‌సాని షాకింగ్ కామెంట్స్‌
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ అనూహ్య‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌ స్టీన్‌ కు వ్య‌తిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలను నిర‌సిస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా ఓ ఉద్య‌మ‌మే జ‌రిగింది. ఆయ‌న బాధితులైన హీరోయిన్ల ఆరోపణల పర్వం ప్రపంచవ్యాప్తంగా విస్త‌రించి ``మీటూ`` పేరుతో ప్రచారానికి తెర తీసిన విషయం తెలిసిందే. మ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కూడా ఈ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాస్టింగ్‌ కౌచ్‌ తో పాటు మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు టాలీవుడ్‌ ను కుదిపేయ‌డంతో పలుమార్లు సినీ పెద్దలు సమావేశమై చర్చించారు. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఫిలింఛాంబర్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమ (టీఎఫ్‌ ఐ) కార్యాచరణను ప్రకటించింది. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలుగు సినిమా డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఇలా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు సాగిన కీల‌క ప‌రిణామాల ప‌ర్వంపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ అనూహ్య రీతిలో స్పందించారు. ఓ ప‌క్క ఈ విష‌యంపై అస‌హ‌నం వెళ్ల‌గ‌క్కుతూనే మ‌రోవైపు ఆ విష‌యాన్ని తేలిక‌గా తీసుకున్నాన‌ని వెల్ల‌డించారు. కాస్టింగ్ కౌచ్ మేజర్ ఇష్యూ కాదని త‌ల‌సాని తేల్చేశారు. అది పెద్ద విషయమైతే తాను వంద‌శాతం జోక్యం చేసుకుంటాన‌ని అలాంటి ప‌రిస్థితి లేదు కాబ‌ట్టే తాను లైట్ గా తీసుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ఫిలిం డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ ప‌రిశీలిస్తోంద‌ని త‌ల‌సాని చెప్పారు. ఇలాంటి ప‌నికిమాలిన విషయాల్ని పెద్దవి చేసి, ప్రపంచమంతా ఇదేనంటూ చూపిస్తే మాత్రం తాను రెస్పాండ్ కానంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మనార్హం. అంతేకాకుండా అలాంటి వాటిపై ఫోక‌స్ పెడితే ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌న్నారు.

కాగా, ఈ సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌రమైన కామెంట్ కూడా త‌ల‌సాని చేశారు. తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న ఈ అంశంపై సినిమాటోగ్ర‌ఫీ ఇలా స్పందించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా..``కాస్టింగ్ కౌచ్ ఎక్కడ జరిగితే అక్కడకు నేను పరుగెత్తుకుంటూ వెళ్లలేను కదా? షూటింగ్ స్పాట్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చోలేను కదా?`` అంటూ ఎదురు ప్ర‌శ్న వేయ‌డంతో..అవాక్క‌వ‌డం అక్క‌డున్న వారి వంతు అయింది.