Begin typing your search above and press return to search.
మిల్కీ .. ఒకే పేమెంట్ మూడు సినిమాలు
By: Tupaki Desk | 17 March 2015 4:02 AM GMTమిల్కీవైట్ బ్యూటీ తమన్నా మనసు వెన్నపూస. ఆ సంగతి ఇట్టే చెప్పేయొచ్చు. కాల్షీట్లు వృధా అయితే నిర్మాతపై నెపం నెట్టేసే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో తమ్మూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల కోసం ఓపిగ్గా ఎదురు చూసింది. అంతేనా.. వాటన్నిటిలో ఒకే పారితోషికంతో నటించింది. వివరాల్లోకి వెళితే గమ్మత్తయిన విషయాలు తెలుస్తాయి. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేయాలనుకున్నప్పుడు తొలుత నాయికగా తమన్నాని ఎంపిక చేసుకున్నారు. అడ్వాన్సుతో పాటు మొత్తం పారితోషికం ముట్టజెప్పేశారు. అయితే అనూహ్యంగా తమ్మూ కాల్షీట్లు సర్ధుబాటు కాలేదు. దాంతో ఆ సినిమాలో ఓ ఐటెమ్గీతం వరకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలైంది. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన తమన్నాని నాయికగా ఎంచుకున్నారు. ముందే పారితోషికం ముట్టింది కాబట్టి కమిట్మెంట్ ప్రకారం ఆ చిత్రంలో నాయికగా నటించడానికి అంగీకరించింది. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు తమిళ హిట్ చిత్రం 'సుందరపాండియన్' రీమేక్‌లో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాగూ అనుకున్న ప్రాజెక్టు వెనక్కెళ్లింది కాబట్టి ఇప్పుడు ఈ రీమేక్‌లో నాయికగా నటించడానికి అంగీకరించిందని సమాచారం. ఆ రకంగా తమన్నా మూడు సినిమాలు మారినట్టయ్యింది. కానీ హీరో మాత్రం ఒక్కడే. మూడు సినిమాలకు పేమెంట్ కూడా ఒక్కటే.