Begin typing your search above and press return to search.

మిల్కీనే హైలైట్.. న‌య‌న్.. ప్చ్ లైట్!!

By:  Tupaki Desk   |   1 Oct 2019 1:30 AM GMT
మిల్కీనే హైలైట్.. న‌య‌న్.. ప్చ్ లైట్!!
X
`సైరా- న‌ర‌సింహారెడ్డి` హైద‌రాబాద్.. బెంగ‌ళూరు.. ముంబై ప్ర‌మోష‌న్స్ గురించి తెలిసిందే. హైద‌రాబాద్ ఈవెంట్ ని వ‌రుణుడు తీవ్రంగా దెబ్బ కొట్టాడు. వ‌రుణుడు వెంటాడ‌డంతో ఎంతో టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. కార‌ణం ఏదైనా ఆ ఈవెంట్ లో చిత్ర‌బృందం మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడకుండా మ‌ధ్య‌లోనే కంగారుగా స్పీచ్ లు ముగించేసింది. ఇక ముంబైలో ఇప్ప‌టికే ప్ర‌చారం మ‌మ అనిపించేశారు.

ఇక సైరా రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందు బెంగ‌ళూరు.. చెన్న‌య్.. అంటూ మెగాస్టార్ - రామ్ చ‌ర‌ణ్ బృందం ప్ర‌చారాన్ని చుట్టేస్తున్నారు. నిన్న సాయంత్రం బెంగ‌ళూరు ఈవెంట్ ని భారీగానే నిర్వ‌హించినా వేదికపై ఏదో మిస్స‌య్యింద‌న్న ఫీలింగ్ వెంటాడింది. మెగాస్టార్.. మెగా ప‌వ‌ర్ స్టార్ ఉన్నా.. అక్క‌డ వేదిక‌పై మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌వ్వులు చిందిస్తూ ఉన్నా.. ఇంకా ఏదో మిస్స‌య్యింది. అస‌లు ఈ వేదిక‌కు అందాల న‌య‌న‌తార రాలేదేం? అందుకేనా గ్లామ‌ర్ మిస్స‌య్యింది అంటూ అభిమానుల్లో సందేహం క‌లిగింది. ఇంత‌కుముందు హైద‌రాబాద్ ఈవెంట్ కి న‌య‌న్ డుమ్మా కొట్టింది. అలాగే బెంగ‌ళూరు ఈవెంట్ కానీ.. ఇత‌ర చోట్ల కానీ ఎక్క‌డా న‌య‌న్ అస‌లు క‌నిపించ‌నే లేదు.

దీంతో అస‌లు న‌య‌న్ కి ఏమైంది? ఇదేమైనా ఆషామాషీ సినిమానా.. ప్ర‌చారానికి రాను అని మొండి ప‌ట్టు ప‌ట్ట‌డానికి!! అంటూ అభిమానుల్లో సందేహం వ్య‌క్త‌మైంది. స్వ‌త‌హాగానే సినిమాల్లో న‌టించ‌డం వ‌ర‌కే న‌య‌న్ త‌న పార్ట్ అంటుంది. ప్ర‌చారం త‌న వ‌ల్ల కాద‌ని ముందే కండిష‌న్ పెట్టేస్తుంది. అయితే రామ్ చ‌ర‌ణ్‌- చిరంజీవి అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించి న‌య‌న్ ఈ వేడుక‌ల‌కు ఎటెండ్ అవుతుంద‌ని భావించారు. ఆ మేర‌కు వార్త‌లు వ‌చ్చినా కానీ న‌య‌న్ ఎందుక‌నో ప్ర‌చారానికి రాలేదు. ఇక రెండ్రోజుల్లో సినిమా రిలీజై రిజ‌ల్ట్ కూడా తేల‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కూ న‌య‌న‌తార ప్ర‌చార ఇంట‌ర్వ్యూ కూడా క‌నిపించ‌లేదు ఏమిటో. అయితే కార‌ణం ఏదైనా వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా త‌మ‌న్నా హైలైట్ అయిపోతోంది. సైరా క్రెడిట్ మొత్తం మిల్కీ ఖాతాలో ప‌డిపోతోంది.

నిన్న సాయంత్రం బెంగ‌ళూరు వేదిక‌పైనా త‌మ‌న్నానే హైలైట్ అయ్యింది. అంత‌కుముందు ట్రైల‌ర్ లోనూ త‌నే హైలైట్ అయ్యింది. ల‌క్ష్మీ పాత్ర‌కు ప్రాధాన్య‌త బాగానే ఉంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. అందుకే త‌మ‌న్నాను హైలైట్ చేస్తూ మెగాస్టార్ బెంగ‌ళూరు వేదిక‌పై చాలా ఎక్కువ‌గానే పొగిడేశారు. త‌న పాత్ర సినిమాలో ఎంతో ఆక‌ట్టుకుంటుందని చిరు అన్నారు. త‌మ‌న్నా గొప్ప‌గా న‌టించింద‌ని కితాబిచ్చారు. త‌మ‌న్నా గురించి దాదాపు 3-4 నిమిషాలు మాట్లాడారు. అయితే అదే వేదిక‌పై న‌య‌న్ గురించి సింపుల్ గా జ‌స్ట్ ఒక లైన్ తో తేల్చేశారు. ప్ర‌చార వేదిక‌ల‌కు వ్య‌తిరేకంగా ఉండే న‌య‌న్ కి ఇది త‌ప్ప‌దు మ‌రి. ఇంత‌కీ సైరా చిత్రంలో న‌య‌న్ పాత్ర ప‌రిధి ఎంత‌? త‌న‌కంటే త‌మ‌న్నా పాత్ర‌నే హైలైట్ గా ఉంటుందా? అన్న‌ది పూర్తి సినిమా చూస్తే కానీ తెలీదు.