Begin typing your search above and press return to search.

తట్టుకోలేని రీతిలో తమన్నా ఓవరాక్షన్!

By:  Tupaki Desk   |   7 Aug 2019 4:42 AM GMT
తట్టుకోలేని రీతిలో తమన్నా ఓవరాక్షన్!
X
గత రెండు సీజన్లలో కనిపించని చిత్రమైన ధోరణి బిగ్ బాస్ 3లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమకు పడని వారిని అవకాశం వచ్చినప్పుటు పంచ్ లు వేయటమో.. మరేదో చేయటమో చూశాం. అందుకు భిన్నంగా చౌకబారుగా.. అదే పనిగా గొడవ పెట్టుకోవాలన్నట్లుగా రెచ్చగొట్టటం.. మాటలతో పోట్లు పొడవటం.. వ్యక్తిత్వ హననం చేయటం లాంటి చౌకబారు పనులకు తెర తీశారు తమన్నా. తనను ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తూ.. రవికృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు నోటికి వచ్చినట్లుగా కామెంట్స్ చేసిన తమన్నా.. మంగళవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లోనూ అదే తీరును కొనసాగించారు.

సోమవారం తానేంటో శాంపిల్ చూపించిన తమన్నా.. మంగళవారం రవికృష్ణకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని తన మాటలతో చూపించారు తమన్నా. రోజంతా రవికృష్ణను వెంటాడుతూ.. మాటలతో హింసించే ప్రయత్నం చేశారు. అవసరం ఉన్నా లేకున్నా.. పప్పుగా అంటూ వేధించింది. అదే పనిగా మాటలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

ఆమె తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సున్నితంగా సముదాయించేందుకు శివజ్యోతి.. శ్రీముఖి.. మహేశ్ విట్టా.. బాబా భాస్కర్ చేసిన ప్రయత్నాల్ని ఆమె నీరుకార్చారు. నేను నరకం చూపిస్తా.. సారీ చెబుతానని హైలెట్ చేస్తాడా? నేనిక నుంచి సారీ చెప్పను.. నేనేంటో చూపిస్తా.. ఇంట్లో ఉండే ఐదు రోజులు నేనేంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చి మరీ మాటలతో హింసను కంటిన్యూ చేసింది.

రవికృష్ణను తమన్నా ఎలా వేధించిందనటానికి శాంపిల్ చెప్పాలంటే.. నాకు పప్పు కావాలని బాబా భాస్కర్ ను అడిగింది. ఏం పప్పు కావాలంటే పవర్ లేని పప్పు కావాలంటూ నోరు పారేసుకుంది. ఆమె మాటలు.. వ్యవహారశైలిలో బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు వినోదం స్థానంలో చిరాకు పుట్టేలా చేసింది. తన మాటలతో తూట్లు పొడిచినట్లుగా వ్యవహరించిన తమన్నా.. అక్కడితో ఆగకుండా.. కెమేరా వద్దకు వెళ్లి రవికృష్ణ తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని ఇచ్చింది. మీ అబ్బాయి తప్పు చేశాడు.. అందుకే రోజంతా వేధిస్తున్నా.. మీ అబ్బాయి చేసిన తప్పునకు ఇలాంటి పనిష్ మంట్ అవసరమే అంటూ ఆమె ప్రదర్శించిన తీరు వెగటు పుట్టించే పరిస్థితి.

రవికృష్ణను అదే పనిగా టార్గెట్ చేస్తూ అదే పనిగా నోరు పారేసుకుంటున్న తమన్నాకు రాహుల్ సిప్లిగంజ్ కౌంటర్ ఇచ్చి.. అండగా నిలిచారు. దీంతో అతగాడి మీద విరుచుకుపడటమే కాదు.. రవికృష్ణకు మించిన వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో వెంటాడుతానని ఇచ్చిన హెచ్చరికకు మించి.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా తాను రాహుల్ ను వెంటాడతానని.. బయట చూసుకుంటానని హెచ్చరించింది. దీనికి ధీటుగా బదులిచ్చారు రాహుల్. తాను కూడా చూసుకుంటానని బదులివ్వటంతో ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరిపోతుందన్న భావన కలిగేలా చేసింది.