Begin typing your search above and press return to search.

గ్రేట్ కమెడియన్.. బతికుండగానే చంపేశారు

By:  Tupaki Desk   |   7 May 2016 8:03 AM GMT
గ్రేట్ కమెడియన్.. బతికుండగానే చంపేశారు
X
సోషల్ మీడియా వచ్చాక ఎంత మంచి జరుగుతోందో అంత చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా పనీపాటా లేని ఆకతాయిలు.. ఏం తోచక చేసే చెత్త ప్రచారాలు కొంతమందికి తీవ్ర ఆవేదన మిగులుస్తున్నాయి. కాస్త వయసు మళ్లిన సెలబ్రెటీని చూసుకుని.. ఆ వ్యక్తి చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు సాగించడం జనాలకు ఫ్యాషన్ అయిపోయింది. ముందు వెనకా చూసుకోకుండా మిగతా వాళ్లు కూడా అదే ప్రచారాన్ని కొనసాగంచడం.. జనాల్ని గందరగోళంలో పడేయడం.. ఇలా సాగుతోంది వరస. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీల్ని బతికుండగానే చంపేసిన సోషల్ మీడియా బారిన తాజాగా తమిళ గ్రేట్ కమెడియన్ సెంథిల్ కూడా పడ్డారు.

65 ఏళ్ల సెంథిల్ అనారోగ్యంతో చనిపోయారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కామెడీ ప్రియులందరూ అయ్యో పాపం అనుకున్నారు. ఆయన అభిమానులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఐతే ఈ రోజు సెంథిల్ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ స్వయంగా ప్రకటన ఇచ్చాడు. తాను క్షేమంగా ఉన్నానని.. ఎలాంటి అనారోగ్యం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. 80లు.. 90ల మధ్య గౌండర్ మణితో కలిసి తమిళ సినిమాల్ని ఏలాడు సెంథిల్.

వీళ్లిద్దరి కాంబినేషన్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇద్దరూ కలిసి అద్భుతమైన కామెడీ పండించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా సెంథిల్ తెలుగువాళ్లకూ పరిచయమే. అతడికి అప్పట్లో బాబూ మోహన్ డబ్బింగ్ చెప్పేవాడు. జెంటిల్మన్ లాంటి సినిమాల్లో అతను పండించిన కామెడీని మన ప్రేక్షకులు కూడా మరిచిపోలేరు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సెంథిల్.. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ప్రచారం చేస్తున్నారు.