Begin typing your search above and press return to search.

నోరుజారి బుక్కయిన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌

By:  Tupaki Desk   |   28 July 2019 11:14 AM GMT
నోరుజారి బుక్కయిన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌
X
బిగ్‌ బాస్‌ అంటేనే గొడవలు.. వివాదాలు.. విమర్శలు. ప్రతి ఎపిసోడ్‌ లో ఏదో ఒక గొడవ జరగడం మనం చూస్తూనే ఉంటాం. లేదంటే బయట అయినా బిగ్‌ బాస్‌ గురించి ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంటుంది. తాజాగా తమిళ బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. నిన్న వీకెండ్‌ అవ్వడంతో కమల్‌ హాసన్‌ కంటెస్టెంట్స్‌ ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా కమల్‌ మాట్లాడుతూ సిటీ బస్సుల్లో ఆడవారు చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తూ ఉంటారు. వారు కొన్ని సార్లు ఆకతాయిల వల్ల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అంటూ కమల్‌ అన్నాడు.

ఆ సమయంలోనే కంటెస్టెంట్‌ శరవణన్‌ స్పందిస్తూ కాలేజ్‌ డేస్‌ లో నేను నా స్నేహితులతో బస్సులో వెళ్లే సమయంలో సరదాగా ఆడవారిని అలా చేసేవాళ్లం అనగానే కమల్‌ తో పాటు ప్రేక్షకులు అంతా కూడా గట్టిగా నవ్వేసి చప్పట్లు కూడా కొట్టారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాను అంటూ చెప్పిన వ్యక్తిని కొట్టాల్సింది పోయి చప్పట్లు కొట్టడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ క్లిప్‌ చాలా వైరల్‌ అవుతోంది.

ఈ విషయమై స్పందించాల్సిందిగా ఒక నెటిజన్‌ సింగర్‌ చిన్మయిని ట్యాగ్‌ చేయగా ఆమె వెంటనే స్పందించింది. మహిళలను వేదించేందుకు బస్సు ఎక్కాను అంటూ చెప్పిన వ్యక్తిని గొప్పగా చూపిస్తూ టీవీ ఛానెల్‌ లో ప్రసారం చేయడం విడ్డూరం. ఇలాంటి సీరియస్‌ విషయాన్ని జోక్‌ లా ప్రజెంట్‌ చేయడం ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఏంటీ అంటూ చిన్మయి ఫైర్‌ అయ్యింది.