Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్‌స్టార్ కోసం విల‌న్ గా త‌మిళ హీరో

By:  Tupaki Desk   |   19 Jan 2022 5:30 AM GMT
ప‌వ‌ర్‌స్టార్ కోసం విల‌న్ గా త‌మిళ హీరో
X
`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. ప్రాంతీయ సినిమాని మించి పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతోంది. దీంతో ప్ర‌తీ ఒక్క‌రి దృష్టి తెలుగు సినిమాపై ప‌డుతోంది. చాలా వ‌ర‌కు ఇత‌ర భాష‌ల న‌టీన‌టులు కూడా తెలుగు చిత్రాల్లో న‌టించాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. కొంత మంది ఎలాంటి పాత్ర అయినా స‌రే చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ త‌మిళ హీరో తెలుగు స్టార్ హీరో మూవీలో విల‌న్ గా న‌టించడానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. `వ‌కీల్ సాబ్‌`తో మూడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ అల‌రించ‌డానికి ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చారాయ‌న‌. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో వ‌రుస చిత్రాల‌ని లైన్ లో పెట్టారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి. ఇప్ప‌టికే మ‌ల‌యాళ రీమేక్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా `భీమ్లా నాయ‌క్‌` చేశారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ గా వుంది.

దీని త‌రువాత ఆయ‌న చేస్తున్న చిత్రాలు క్రిష్ డైరెక్ష‌న్ లో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌`. ఈ రెండు చిత్రాల్లో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఒకే సారి `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` చిత్రాల‌ని పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. `గ‌బ్బ‌ర్ సింగ్ ` కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` పై ప‌వ‌న్ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న‌ట్టుగా చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ మూవీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌. ఇందులో భ‌గ‌త్‌సింగ్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని, ఈ పాత్ర కోసం హ‌రీష్ శంక‌ర్ చాలా కేర్ తీసుకుంటున్నార‌ని, సినిమాకు ఈ పాత్ర ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఈ పాత్ర తెర‌పై మ‌రింత శ‌క్తివంతంగా వుండాలంటే దాన్ని ఢీకొట్టే ధీటైన విల‌న్ వుండాల‌ని ఇందు కోసం ఓ త‌మిళ హీరోని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సంప్ర‌దిస్తున్నార‌ట‌.

ఆ హీరో మ‌రెవ‌రో కాదు విజ‌య్ సేతుప‌తి. ఇటీవ‌ల విజ‌య్ హీరోగా న‌టించిన `మాస్ట‌ర్`, వైష్ఫ‌వ్ తేజ్ న‌టించిన `ఉప్పెన‌` చిత్రాల్లో విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ తో ఢీకొట్టే విల‌న్ గా విజ‌య్ సేతుప‌తి అయితేనే బాగుంటుంద‌ని, రెండు పాత్ర‌లు పోటీపోటీగా వుంటాయిని, ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తాయ‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. అయితే విజ‌య్ సేతుప‌తి నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ని, వ‌స్తే `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` ఓ రేంజ్ లో వుంటుంద‌ని చెబుతున్నారు.