Begin typing your search above and press return to search.

మురగను వదిలేట్టు లేరుగా..!

By:  Tupaki Desk   |   28 Nov 2018 6:44 AM GMT
మురగను వదిలేట్టు లేరుగా..!
X
అన్నాడీఎంకే నాయకులు దర్శకుడు మురుగదాస్‌ ను ఇప్పట్లో వదిలి పెట్టేట్టు కనిపించడం లేదు. సర్కార్‌ చిత్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను మరియు తమ అమ్మ జయలలితను విమర్శించినందుకు గాను ఆ పార్టీ నాయకులు మురుగదాస్‌ పై చాలా సీరియస్‌ గా ఉన్నారు. సర్కార్‌ చిత్రం విడుదలైన సమయంలో నాయకులు థియేటర్లను ద్వంసం చేయడంతో పాటు నానా రచ్చ చేశారు. దాంతో మురుగదాస్‌ వారికి ఇబ్బంది కలిగించిన సీన్స్‌ ను తొలగించడం జరిగింది. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సాధించింది. సినిమా అక్కడక్కడ మాత్రమే ప్రదర్శింపబడుతోంది. 2.ఓ వచ్చిన తర్వాత ఆ కొన్ని థియేటర్ల నుండి కూడా వెళ్లి పోనుంది. మరో వైపు మురుగదాస్‌ ఆ సీన్స్‌ ను తొలగించాడు కనుక వివాదం సర్దుమణిగిందని అంతా భావించారు. కాని అన్నాడీఎంకే మాత్రం ఈ వివాదాన్ని సాగతీస్తూనే ఉన్నారు.

సినిమా నుండి ఆ సీన్స్‌ ను తొలగించిన దర్శకుడు మురుగదాస్‌ అన్నాడీఎంకే ప్రభుత్వంకు మరియు నాయకులకు క్షమాపణలు చెప్పేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. దాంతో ప్రభుత్వం తమ చేతిలో ఉన్న కారణంగా అన్నాడీఎంకే నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మురుగదాస్‌ తో క్షమాపణ చెప్పించాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం పరువు తీసేలా మురుగదాస్‌ వ్యవహరించాడంటూ అన్నాడీఎంకే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్దమవుతున్నట్లుగా తమిళనాట వార్తలు వస్తున్నాయి. బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు, మరోసారి ప్రభుత్వంకు వ్యతిరేకంగా తన సినిమాలో విమర్శలు చేయనంటూ రాతపూర్వక హామీ ఇవ్వాలని అన్నాడీఎంకే నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మురుగదాస్‌ ఎలా స్పందిస్తాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరో వైపు తమిళ సినీ పరిశ్రమ మురుగదాస్‌ కు మద్దతుగా నిలుస్తోంది. పలువురు తమిళ స్టార్స్‌ మురుగదాస్‌ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.