Begin typing your search above and press return to search.

పాపం ఆ కుర్ర డైరెక్టర్ మీద కత్తి కట్టేశారే

By:  Tupaki Desk   |   7 Jun 2016 7:03 AM GMT
పాపం ఆ కుర్ర డైరెక్టర్ మీద కత్తి కట్టేశారే
X
ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పని చేసిన అనుభవం లేదు. పెద్దగా వయసూ లేదు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసుకుంటూ.. ఇంటర్నెట్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ మీద అవగాహన పెంచుకుంటూ.. షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ.. ఉన్నట్లుండి ‘పిజ్జా’ అనే సినిమాతో కోలీవుడ్ లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. ఆ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్టయి.. బాలీవుడ్లో సైతం చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత ‘జిగర్ తాండా’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘ఇరైవి’ సినిమాకు కూడా అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఐతే ఈ కుర్ర డైరెక్టర్ ఇప్పుడో పెద్ద వివాదంలో చిక్కుకుని ‘ఇరైవి’ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని స్థితిలో పడిపోయాడు. ఇందులో అతడి తప్పిదం కూడా ఉందిలెండి. ఇంతకీ మేటర్ ఏంటంటే..

తన రెండో సినిమా ‘జిగర్ తాండా’ నిర్మాత కదిరేశన్ వల్ల కార్తీక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అప్పట్లో. బడ్జెట్ పెరిగిపోవడం మీద ఇద్దరి మధ్య గొడవలు నడిచాయి. ముందుగా అనుకున్న ప్రకారం తనకు హిందీ రీమేక్ రైట్స్ లో వాటా ఇవ్వకపోవడంపై కార్తీక్ పెద్ద పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఇరైవి’లో కదిరేశన్ ను ఉద్దేశించి ఓ క్యారెక్టర్ పెట్టాడు కార్తీక్. ఆ పాత్రను చాలా చెడ్డవాడిగా చూపించాడు. అతడి వల్ల ఓ దర్శకుడి జీవితం నాశనం అయినట్లు చిత్రీకరించాడు. తర్వాత ఆ పాత్రను కిరాతకంగా చంపేట్లు కూడా చూపించాడు. ఐతే సినిమా విడుదలయ్యాక దీని మీద తమిళ నిర్మాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కదిరేశన్ కొందరు నిర్మాతల్ని కూడగట్టి కార్తీక్ మీద చర్యల కోసం పట్టుబడుతున్నాడు. దీని మీద నిన్న కొందరు నిర్మాతలు సమావేశం కూడా నిర్వహించారు. అందరూ కలిసి ఇకపై కార్తీక్ తో ఎవరూ సినిమాలు చేయకూడదంటూ నిర్మాతల మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘ఇరైవి’ నిర్మాతల్లో ఒకడైన జ్నానవేల్ రాజా సైతం కార్తీక్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రూ.7 కోట్లతో సినిమా తీస్తానని చెప్పి రూ.13 కోట్లకు బడ్జెట్ పెంచేశాడంటూ అతను కార్తీక్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. అతడిపై చర్యలు తీసుకోవాలంటున్న నిర్మాతలకు వంత పాడుతున్నాడు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.