Begin typing your search above and press return to search.

విశాల్ స‌త్తా...అతిపెద్ద పైర‌సీ టీం అరెస్ట్‌

By:  Tupaki Desk   |   18 March 2018 3:43 PM GMT
విశాల్ స‌త్తా...అతిపెద్ద పైర‌సీ టీం అరెస్ట్‌
X
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండానే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్ నెట్ లో ప్రింట్‌ వచ్చేస్తోంది. దేశంలో ఏ భాషా చిత్రాలనైనా పైరసీ వణికించేస్తోంది. పైరసీకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. ఉగ్రవాదంలా పైరసీ కూడా ఓ మహమ్మారిలా తయారైంది. ముఖ్యంగా త‌మిళ‌నాట త‌మిళ రాక‌ర్స్‌, త‌మిళ బాక్స్ అనే సంస్థ‌లు సినిమా రిలీజైన రోజే పైర‌సీని మార్కెట్‌లోకి తీసుకొచ్చి నిర్మాత‌ల గుండెల్లో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో ర‌కాల ఆలోచ‌న‌లు చేస్తుంది. అయితే ద‌శాబ్దంగా పైర‌సీ దారుల ఆగ‌డాల‌కి అడ్డుకట్ట వేయ‌లేక‌పోయిన పోలీసులు త‌మిళ‌నాడులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

త‌మిళ రాకర్స్ అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్ర‌భుల‌ని అరెస్ట్ చేశారు. విజుపురం మ‌రియు నెల్లై ప్రాంతాల‌లో ఈ ముగ్గురి నిందితులని కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిపైన కేసు న‌మోదు చేసిన పోలీసులు వారిని విచారించి మిగ‌తా వివ‌రాలు రాబ‌ట్టనున్నారు. త‌మిళ రాక‌ర్స్ గ‌త కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాల‌ని కూడా రిలీజ్ రోజే ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తూ వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమా నిర్మాత‌ల‌ని కూడా వ‌ణికించిన వీరు సినిమా రిలీజ్ కొద్ది గంట‌ల‌లోనే సైట్‌లో అప్‌లోడ్ చేసి వారికి భారీ న‌ష్టాల‌ని మిగిలిస్తూ వ‌చ్చారు. . ఈ వ్యాపారం ద్వారా తమిళ రాకర్స్ కోటి రూపాయలు, డీవీడీ రాకర్స్ 75 లక్షలు సంపాదించారు. దాదాపు 19 డోమైన్ల నుంచి వారు సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు. వెబ్‌సైట్‌లో పెడుతున్న వ్యాపార ప్రకటనల ద్వారా పైరసీ ముఠాను పట్టుకున్నామ‌ని వివ‌రించారు.

తమిళ సినీ నిర్మాతల మండలి తరఫున హీరో విశాల్ ఎంతో ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. వారి అక్రమ వ్యవహారాలను విశాల్ గుట్టురట్టు చేస్తున్నారు. ఇటీవల విశాల్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడతూ.. అక్రమంగా దక్షిణాది చిత్రాలను వెబ్‌సైట్లలోకి అప్‌లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. పోలీసుల‌తో క‌లిపి చేసిన ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌లో ఈ ఆప‌రేష‌న్ స‌ఫ‌లం అయింది.