Begin typing your search above and press return to search.

హీరో విజయ్ చేసిన పాపమేంటి?

By:  Tupaki Desk   |   1 Oct 2015 3:55 AM GMT
హీరో విజయ్ చేసిన పాపమేంటి?
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పగబట్టిందంటే.. అది ఎలా ఉంటుందో కరుణానిధిని అడిగితే తెలుస్తుంది. ఐతే రాజకీయాల్లో పగబట్టడాలు - కక్షసాధింపులు మామూలే కానీ.. సినిమా వాళ్ల మీద కూడా ఏళ్లకు ఏళ్లు కక్ష సాధించడమే విడ్డూరం. తమిళనాట రాజకీయాలన్నీ దాదాపుగా సినిమా వాళ్లతోనే ముడిపడటం దీనికి ఓ కారణం కావచ్చు. ఐతే హీరో విజయ్ విషయంలో జరుగుతున్నది మాత్రం దారుణాతి దారుణం. అతడి ప్రతి సినిమాకీ ఏదో ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడుతోంది. సరిగ్గా సినిమా విడుదల సమయానికి బ్రేక్ పడిపోతోంది. నాలుగైదు రోజుల పాటు విజయ్ ను తీవ్ర మానసిక వేదను గురి చేసేస్తున్నాయి అక్కడి రాజకీయాలు. తాజాగా ‘పులి’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.

అయినా విజయ్ మీద జయలలిత కక్ష గట్టేంత తప్పు అతను ఏం చేశాడన్నది చాలామందికి సందేహం. ఐతే అతను డైరెక్టుగా ఏమీ చేయలేదు. ‘తలైవా’ అనే పేరుతో ఓ సినిమా తీశాడు. తలైవా అంటే నాయకుడు అని అర్థం. ఒకప్పుడు ఎంజీఆర్ ను ఇలా అనేవారు. ఆ తర్వాత రజినీని కూడా అభిమానులు అలాగే పిలుచుకున్నారు. ఐతే రజినీ తర్వాత తమిళనాట ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాల్లో ఉన్నట్లు మూడేళ్ల కిందట ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరుగుతుండగానే అతను ‘తలైవా’ అనే సినిమా తీశాడు. అందులో అతణ్ని ఓ లీడర్ గా చూపించారు. రాజకీయాల ప్రస్తావన కూడా ఉంది అందులో. తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని చాటడానికే విజయ్ ఈ సినిమా తీసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇది జయలలితకు కాక తెప్పించి.. ఏవేవో కారణాలతో ఆ సినిమాను అడ్డుకుందని అప్పట్లో టాక్ నడిచింది. విజయ్ రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేసే వరకు అప్పట్లో చాలా గొడవలే నడిచాయి. ఆ తర్వాత ‘కత్తి’ విషయంలోనూ అతణ్ని లేని పోని వివాదాలు వెంటాడాయి. ఈ సినిమా నిర్మాణ సంస్థకు, శ్రీలంక ప్రభుత్వానికి ముడిపెడుతూ వివాదాలు రాజేశారు. ఈ సినిమా విడుదలకు ముందు, తర్వాత విజయ్ పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు ‘పులి’ విషయంలోనూ విజయ్ కు టెన్షన్ తప్పట్లేదు.

విడుదలకు అంతా ఓకే అనుకున్నాక.. ముందు రోజు రాత్రి గొడవ మొదలైంది. తమిళనాట వీక్ డేస్‌ లో ఐదు షోలకు మించి వేయకూడదన్న నిబంధన ఒకటుంది. ఐతే దాన్ని ఎవరూ పాటించట్లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఐతే విజయ్ సినిమా వచ్చేసరికి సడెన్ గా ఆ రూల్ గుర్తుకొచ్చింది అధికారులకు. అన్ని చోట్లా స్ట్రిక్టుగా నిబంధన అమలు చేస్తుండటంతో తొలి రోజు అర్లీ మార్నింగ్ షోలు రద్దయిపోయాయి. ఇది సినిమా ఓపెనింగ్స్ కు చాలా పెద్ద దెబ్బే. మరోవైపు ఉన్నట్లుండి ఈ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ఐతే దీని వెనుక జయలలితే ఉన్నారన్నది విజయ్ అభిమానుల ఆరోపణ. వరుసగా తన సినిమాలకు ఇలా లేని పోని ఇబ్బందులు సృష్టిస్తుండటంతో రగిలిపోతున్నాడు విజయ్. అతను ఇంకెంత కాలం ఓపిక పడతాడో చూడాలి.