Begin typing your search above and press return to search.

ఇళయరాజా నోటీసులపై ఓపెన్ అయ్యారు

By:  Tupaki Desk   |   21 March 2017 6:16 PM GMT
ఇళయరాజా నోటీసులపై ఓపెన్ అయ్యారు
X
సూటిగా ఇదే మాటను అనలేదు కానీ.. ఇంచుమించే ఇదే అర్థం ధ్వనించేలా తన అభిప్రాయాన్ని.. ‘‘నా ఆలోచన’’ అన్న పొట్టి వీడియోతో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. ప్రైవేటు కార్యక్రమంలో తన పాటలు పాడినందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు ఇవ్వటంపై నడుస్తున్న వివాదంపై తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని కాస్తంత సూటిగా..స్పష్టంగా వెల్లడించారు.

ఒక నిర్మాత తాను డబ్బు పెట్టి సినిమాను నిర్మిస్తూ.. అందులో భాగంగా దర్శకుడు..రచయిత.. సంగీత దర్శకుడు.. గాయనీ.. గాయకులు.. సాంకేతిక బృందంతో పాటల్నితయారు చేయిస్తూ.. దానిపై చట్టపరమైన హక్కులు సంగీత దర్శకుడి సొంతం కావటం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇప్పుడున్న కాపీరైట్ చట్టంలోని అంశాల్ని సినీ సమాఖ్య పెద్దగా పట్టించుకోకపోవటంతో పెట్టుబడి పెట్టిన నిర్మాతకు హక్కులు రాకుండా.. కాపీ రైట్ చట్టం కింద సంగీత దర్శకుడికి చట్టబద్ధమైన హక్కులు రావటం చూస్తుంటే బాధ కలుగుతుందన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇది సరైన పద్ధతి కాదని.. ఆ మాటకు వస్తే.. సినిమాను చూసే ప్రేక్షకుడు..మ్యూజిక్ సీడీ వినే అభిమాని..అంతా ఆ పాటను పాపులరైజ్ చేస్తారని.. అలాంటి పాటల్ని గాయకులు పాడుతుంటే.. నలుగురికి ఆ పాట గురించి తెలుస్తుందని.. దీని వల్ల మరింత పేరు ప్రఖ్యాతులు సొంతం అవుతాయి కదా? అని ప్రశ్నించారు. ఒకవేళ.. ఒక సంగీత దర్శకుడి కంపోజ్ చేసిన పాటల్నిఎవరూ పాడకపోతే.. ఎవరికి గుర్తుండరు.తాజా ఎపిసోడ్ విషయంలో ఇళయరాజాను ఈతరానికి పరిచయం చేయటానికి ఆయన పాటలు పాడే వారి కారణమని.. అలంటి వారికి నోటీసులు ఇవ్వటం ఏమిటంటూ ప్రశ్నించారు.

ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన అవసరం ఉందంటూ నిర్మాతలకు తన అభిప్రాయాన్ని పెట్టిన ఆయన.. చట్టానికి అవసరమైన రిపేర్లు చేయాల్సి వస్తే.. వాటిని చేయటం మంచిదన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమైనా ఇళయరాజా నోటీసులు పంపిన తీరు తనకు నచ్చలేదన్న తమ్మారెడ్డి భరద్వాజ మాటల్ని ఇంకెంత మంది సపోర్ట్ చేస్తారో చూడాలి.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/