Begin typing your search above and press return to search.

పైరసీ చూస్తామన్నవాళ్లను వాయించేశాడు

By:  Tupaki Desk   |   3 May 2017 10:31 AM GMT
పైరసీ చూస్తామన్నవాళ్లను వాయించేశాడు
X
బాహుబలి టికెట్లు దొరకట్లేదని.. టికెట్లు రేట్లు పెంచి అమ్ముతున్నారని.. కాబట్టి పైరసీలో ఈ సినిమా చూస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రెండు మూడు రోజులుగా. అలాగే ‘బాహుబలి: ది కంక్లూజన్’కు భారీ వసూళ్లు వస్తున్న నేపథ్యంలో అందులో కొంత మొత్తం రైతులకు ఇవ్వాలంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనిపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. ఇలా మాట్లాడుతున్న వాళ్లకు ఆయన గట్టిగా రిటార్ట్ ఇచ్చారు.

బాహుబలి-2 టికెట్లు దొరకని పక్షంలో ఒకట్రెండు రోజులు ఆగితే సరిపోతుందని.. ఎక్కువ రేటు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఏముందని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఎక్కువమంది సినిమా చూడాలని కోరుకున్నపుడు టికెట్ దొరకడం కష్టమే అని.. డిమాండును బట్టి కొంతమంది ఎక్కువ రేటుతో టికెట్లు అమ్ముతూ ఉండొచ్చని.. అంతమాత్రాన పైరసీలో దొంగతనంగా సినిమా చూస్తామనడం ఎంత వరకు న్యాయమని తమ్మారెడ్డి ప్రశ్నించారు. మల్టీప్లెక్సులోనే చూడాలి.. కోరుకున్న సమయంలోనే సినిమా చూడాలి అనుకున్నపుడే సమస్య వస్తుందని.. అన్నీ తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ మళ్లీ టికెట్ల రేట్ల గురించి ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్లలో 70-100 రూపాయల మధ్య టికెట్లు అందుబాటులో ఉంటాయని.. రెండు రోజులు దాటితే మామూలు రేట్లకే సినిమా చూసే అవకాశం వస్తుందని ఆయనన్నారు.

ఇక బాహుబలి ఆదాయంలో కొంత మొత్తం రైతులకు ఇవ్వాలన్న వాదనా సరైంది కాదని తమ్మారెడ్డి అన్నారు. వాళ్లేదో కష్టపడి సినిమా తీసుకున్నారని.. దానికి రైతులకు ముడిపెట్టడం సరి కాదని చెప్పారు. వాళ్లు కష్టపడి సినిమా తీశారు కాబట్టి జాలిపడి సినిమా చూడట్లేదని.. జనాలకు నచ్చింది కాబట్టి చూస్తున్నారని.. రైతుల కోసం స్వతహాగా ఏమీ చేయని వాళ్లందరూ.. ఇప్పుడు బాహుబలికి లింకు పెట్టి ఆదాయం పంచమనడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/