Begin typing your search above and press return to search.
కిషన్ ఓ పింప్..సినిమావాడు కాదు:తమ్మారెడ్డి
By: Tupaki Desk | 18 Jun 2018 8:03 AM GMTచికాగో సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ , శాండల్ వుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లు పట్టుబడడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సెక్స్ రాకెట్ కు సూత్రధారి అయిన కిషన్ గతంలో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం...దాంతోపాటు కొందరు టాలీవుడ్ హీరోయిన్లు ఈ రాకెట్ లో బాధితులుగా ఉండడంతో టాలీవుడ్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తోంది. అయితే, ఈవెంట్ల పేరుతో వెళ్లి ఈ రకమైన వ్యవహారాలు నడిపేవారికి, టాలీవుడ్ తో సంబంధం ఉందనడం సరికాదని హీరోయిన్ మాధవీలత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇదే తరహా అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వ్యక్తపరిచారు. కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసి ఉండొచ్చని....ఇపుడు అతడో విటుడిగా మారి ఈ రాకెట్ నడుపుతున్నాడని.... అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో కిషన్ కు సంబంధాలున్నట్లు ప్రచారం చేయడం సరికాదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
కిషన్ - చంద్రకళలను పోలీసులు అరెస్టు చేశారని - దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారని తమ్మారెడ్డి అన్నారు. అయితే, అక్కడ కొంతమంది టాలీవుడ్ నటీమణులు - హీరోయిన్లు ఇన్ వాల్వ్ అయి ఉండవచ్చని, కానీ, తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్ తో లింకు పెట్టడం బాధాకరమన్నారు. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడని, అతడి చేతిలో కొందరు చిక్కుకున్నారని - అతడిని పింప్ అనకుండా ప్రొడ్యూసర్ అని - సినిమా వాడు అని సంబోధించడం సరికాదని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మంచి చెడులు - రివ్యూలు రాయవచ్చని - కానీ - లేనిది ఉన్నట్లు కల్పించి వార్తలు రాయడం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇటువంటి వార్తలు చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రావాలంటే ఆడవాళ్లు భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాతావరణం ఉందని మీడియా పదేపదే ప్రచారం చేస్తే తెలుగు ఆడవారు తెలుగు సినిమాల్లోకి రారని చెప్పారు.
కేవలం కిషన్ పంపిన ఈ మెయిల్స్ - ఫోన్ సంభాషణ ఆధారంగా అక్కడి ఈవెంట్లకు వెళ్లడం సరికాదన్నారు. కిషన్ ను చాలామంది చూడనే లేదని, అలాంటి వారిని నమ్మి వెళితే ఇబ్బందిపడతారని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇకపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్ ద్వారా విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదన్నారు. అమెరికాలో ఈవెంట్ల పేరుతో ఇలాంటి చీకటి వ్యవహారాలు నడపడంలో తెలుగు సంఘాలు కూడా తెలిసో తెలీకో ఇన్ వాల్వ్ అయ్యాయని తమ్మారెడ్డి అన్నారు. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయని, ఇన్విటేషన్స్ పంపుతున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉందన్నారు. అందరం సమిష్టిగా ఇటువంటివి జరగకుండా ఆపకపోతే తెలుగువారి పరువు గంగపాలవుతుందన్నారు.