Begin typing your search above and press return to search.
సెక్స్ రాకెట్ లో సిగ్గుపడాల్సింది వాళ్లే..
By: Tupaki Desk | 14 July 2018 8:36 AM GMTఅమెరికాలో బయటపడిన సెక్స్ రాకెట్ పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వారికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ‘సెక్స్ రాకెట్ బయటపడితే సిగ్గు పడాల్సింది ఇండస్ట్రీ కాదు.. వ్యభిచారం చేసిన వారు.. ఇక్కడి వారిని అక్కడికి పిలిపించి మభ్యపెట్టి - బెదిరించి - బలవంతపెట్టి ఇలాంటి నీచమైన పనులు చేయిస్తున్నవారే సిగ్గుపడాలి’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.
వేషం వేసిన ప్రతి వాడు నటుడు అయిపోడని.. నటులు ఏదైనా నేరాల్లో ఇరుక్కుంటే సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం సరైంది కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా వెళ్లిన వారిలో దాదాపు 30 మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో పైనున్న మూడు నాలుగు పేర్లు మాత్రమే సినిమా వాళ్లవి అని.. మిగతా పేర్లన్నీ సినిమా వాళ్లవా.? అని ప్రశ్నించారు. ఎక్కువమంది రెండు, మూడు సినిమాలు చేసిన వారే.. వారినే మభ్యపెట్టి అమెరికా తీసుకెళ్లి మోసం చేశారో.. వాళ్లే ఇష్టపడితే చేయించారో.? ఏదో ఒకటి జరిగి ఉంటుందని అన్నారు. దీనికి సినిమా ఇండస్ట్రీ ఎందుకు తలదించుకోవాలని తమ్మారెడ్డి ప్రశ్నించారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన వారు అమెరికాలో ఉండి ఇదంతా చేయించిన వారే అని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.
‘‘ఆశతోనే - అవసరం వల్లనో ఈ రొంపిలోకి కొందరు దిగవచ్చు. ఆ రొంపిలోకి తోసిన వారిని మనం ప్రశ్నిస్తే బాగుంటుదని’’ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. స్త్రీ ఒక వస్తువు అయిపోయిందని.. వాడకం దారు ఉంటేనే ఈ పని జరుగుతుందని.. వాడకం దారు లేకుండా చేయడం ఇక్కడ ముఖ్యమని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.