Begin typing your search above and press return to search.

మాస్కు పెట్టుకోకుండా ఈ హీరోయిజం ఏంది నాయనా?

By:  Tupaki Desk   |   16 July 2021 3:03 AM GMT
మాస్కు పెట్టుకోకుండా ఈ హీరోయిజం ఏంది నాయనా?
X
రీల్ మీద హీరో అయితే మాత్రం.. రియల్ లైఫ్ లో అంత నిర్లక్ష్యంగా వ్యవహరించటమా? బుద్దిగా ఇంట్లో ఉండిపోకుండా గుడికి వచ్చినప్పుడు.. మిగిలిన వారి వల్ల తనకెంత ప్రమాదమో.. తన కారణంగా చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవటం సెలబ్రిటీలకు చాలా అవసరం. తాజాగా ఆ చిన్న విషయాన్ని మిస్ అయి.. స్థానికుల చేత.. సోషల్ మీడియాలోనూ తిట్లు తిట్టించుకుంటున్న వైనం తాజాగా చోటు చేసుకుంది. సినీ హీరో తనీష్.. గాయకుడు రేవంత్ తో పాటు వారి వెంట వచ్చిన వారు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

థర్డ్ వేవ్ వార్నింగ్ లు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలకు వచ్చిన ఈ సెలబ్రిటీలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాధారణంగా ఈ గుడికి వచ్చే వారంతా తప్పనిసరిగా ముఖానికి మాస్కు పెట్టుకోవాల్సిందే. అందుకు భిన్నంగా వ్యవహరించారు ఆలయ అధికారులు. ముఖానికి మాస్కుపెట్టుకోకుండానే ఆలయానికి వచ్చిన హీరో తనీష్.. సింగర్ రేవంత్ తో పాటు వారి వెంట వచ్చిన వారు సైతం ముఖానికి మాస్కు పెట్టుకోకున్నా.. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికిన వైనం తాజాగా విమర్శలకు తావిచ్చింది.

తాజాగా ఏపీ సర్కారు మాస్కు వినియోగం మీద కీలక ఆదేశాల్ని జారీ చేసింది. మాస్కు ధరించని వారికి కచ్ఛితంగా ఫైన్ వేయాలని పేర్కొంది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రానికి మాస్కు లేకుండా రావటం సరికాదని.. మిగిలిన భక్తుల ఆరోగ్యాలతో ఆడుకోవటమే అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఒకవేళ మాస్కు లేకుండా సెలబ్రిటీలు ఆలయంలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు.. ఆలయ అధికారులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.

అదేమీ చేయకుండా.. అధికారులే ఎదురెళ్లి మరీ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికిన తీరుపై అధికార వర్గాల్లోనూ హాట్ చర్చగా మారింది. కరోనా వేళలో ఆలయ దర్శనంలో సెలబ్రిటీలకు ఒక రూలు.. సామాన్యులకు మరో రూల్ ఎలా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దరిద్రం కాకుంటే.. గుడికి వచ్చి మరీ వివాదాల్లోకి చిక్కుకుపోవటం ఏమిటి తనీష్?